ఆశారాం ఆశ్రమానికి వెళ్లిన హైదరాబాద్‌ యువకుడు అదృశ్యం!

18 Nov, 2021 09:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద ఆశారాం బాపూ ఆశ్రమం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆశ్రమానికి వెళ్లిన ఓ హైదరాబాద్‌ యువకుడు అదృశ్యమయ్యాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ శివారు మోతేరాలో ఉన్న ఈ ఆశ్రమానికి హైదరాబాద్‌ యువకుడు విజయ్‌ యాదవ్‌ తన స్నేహితులతో కలసి ఈ నెల 3న వెళ్లి అక్కడే బసచేశాడు. ఈ క్రమంలో అతడు 11వ తేదీ నుంచి కనిపించట్లేదు.

ఆందోళన చెందిన కుటుంబీకులు సోమవారం ఆ ఆశ్రమానికి వెళ్లి విచారించగా నిర్వాహకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో అక్కడి చాంద్‌ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు కావడంతో డీసీపీ–2 విజయ్‌ పాటిల్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ జైల్లో ఉన్నారు.

ఈ నెల 8న విజయ్‌యాదవ్‌తోపాటు అతడి స్నేహితులు జోధ్‌పూర్‌లోని ఆశారాం ఆశ్రమంలో జరిగిన శిబిరానికి హాజరయ్యారు. మిగిలినవాళ్లు ఈ నెల 10న తిరిగి వచ్చేయగా, తాను మరికొన్ని రోజులుండి వస్తానంటూ విజయ్‌ అక్కడే ఆగిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబీకులు అతడికి ఫోన్‌ చేస్తున్నా స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన విజయ్‌ సోదరుడు, ఓ బంధువు మోతేరాకు చేరుకుని ఆశ్రమ నిర్వాహకులను ఆరా తీశారు.

వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆశ్రయంలోకి వెళ్లినట్లు విజయ్‌ పేరు నమోదైనా, బయటకు వచ్చినట్లుగా నమోదు కాలేదు. ఆశ్రమంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించాలంటూ కుటుంబీకులు కోరగా 11వ తేదీకి సంబంధించిన ఫీడ్‌ అందుబాటులో లేదంటూ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. 
అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు 

విజయ్‌ మెయిల్‌ ఐడీ నుంచి మెస్సేజ్‌..
ఆశ్రమంతోపాటు ఆశారాం బాపూ వ్యవహారశైలి కూడా వివాదాస్పదం కావడం, గతంలోనూ కొందరు ఇక్కడ మిస్సింగ్‌ అయిన ఉదంతాలు ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. 2008లో ఇదే ఆశ్రమం నుంచి అదృశ్యమైన దీపేశ్, అభిషేక్‌లు సమీపంలోని నదిఒడ్డున శవాలుగా కనిపించారు.

బుధవారం విజయ్‌ ఈ–మెయిల్‌ ఐడీ నుంచి కుటుంబీకులకు ఓ మెస్సేజ్‌ వచ్చిందని, స్వచ్ఛందంగా అజ్ఞాతంలోకి వెళ్తున్నానని, ఆశ్రమంపై అపవాదులు వేయవద్దని అందులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తు అధి కారులు సదరు ఈ–మెయిల్‌ వచ్చిన ఐపీ అడ్రస్‌ను కనిపెట్టడానికి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు