Sonia Gandhi: నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని

17 Oct, 2021 04:40 IST|Sakshi
సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్న రాహుల్, సోనియా గాంధీ, ఏకే ఆంటోని, అంబికాసోని, గులాంనబీ ఆజాద్‌

జీ–23 నేతలకు స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ

ఐదున్నర గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం

వచ్చే ఏడాదే కొత్త అధ్యక్ష ఎన్నికలు..!

2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య పార్టీ అధ్యక్ష ఎన్నిక

నవంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు సభ్యత్వ నమోదు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై వ్యూహ రచన

మూడు అంశాలపై తీర్మానాలు చేసిన సీడబ్ల్యూసీ

హాజరైన రాహుల్, ప్రియాంక, సీఎంలు గహ్లోత్, భగేల్, ఛన్నీ

పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ ఉండాలని ప్రస్తావించిన గహ్లోత్‌

సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్‌ నాయకత్వంపై జీ–23 నేతలు ప్రశ్నలు లేవనెత్తడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కఠినవైఖరి ప్రదర్శించారు. తానే పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలినని, అందరూ అనుమతిస్తే ఉంటానని శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఐదున్నర గంటల పాటు జరిగిన కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో కేంద్రప్రభుత్వ విధానాలు, మూడు వ్యవసాయ చట్టాలు– రైతు ఉద్యమం, లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటన, జమ్మూకశ్మీర్‌లో మైనార్టీలపై దాడులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను, ఆందోళనలను తాము చూసీ చూడనట్లుగా ఎప్పుడూ వ్యవహరించలేదని, ప్రతీ అంశంపై చర్చించే నిర్ణయం తీసుకున్నామని, అయితే మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. కాగా సోనియా చేసిన ఈ ప్రకటన పార్టీ అసంతృప్త నేతల గ్రూప్‌ అయిన జీ–23కి తగిన సమాధానం ఇచ్చినట్లేనని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్‌ శర్మ, కపిల్‌ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్‌ తివారీ, భూపిందర్‌ సింగ్‌ హుడా సహా 23 మంది నాయకులు గత ఏడాది సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీలో కీలక మార్పులు జరగాలని, సమర్థవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు. అప్పటినుంచి ఏదో ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం కపిల్‌ సిబల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించే అంశంపై స్పష్టతనిచ్చారు. సోనియా నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు లేవని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం.

కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేక స్వరంపై మాట్లాడిన సోనియాగాంధీ, ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, అయితే పార్టీలో ప్రతీ ఒక్కరు ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, ప్రతి సవాలును ఎదుర్కోగలమని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై ఈ ఏడాది జూన్‌ 30 లోపు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు రోడ్‌మ్యాప్‌ తయారు చేసినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు.

సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియ గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ పూర్తి సమాచారం ఇస్తారని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నాయకులకు సోనియా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ నిలబడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐక్యత, పార్టీ ప్రయోజనాలను అగ్రస్థానంలో ఉంచడం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరింత అవసరమని సోనియా వ్యాఖ్యానించారు. కాగా రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించాలని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. ఈ ప్రస్తావనకు సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన అభిప్రాయానికి మద్దతు ఇచ్చారు.

వచ్చే ఏడాది జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు సంస్థాగత ఎన్నికల వాయిదా విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మినహా ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకోని పరిస్థితుల్లో మరోసారి పార్టీలో అంతర్గత అలజడి చెలరేగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్గత పోరును బయటపడనీయకుండా ఉండేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు రాహుల్‌ గాంధీ వెంటనే అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని, అందుకే పార్టీలో ఒడిదుడుకుల కారణంగా సోనియా అలా చెప్పవలసి వచ్చిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగినప్పటికీ రాహుల్,ప్రియాంక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే మాత్రం జీ–23 నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో గెలిస్తే పార్టీపై గాంధీ కుటుంబం పట్టు మరింత బలపడుతుంది.

లఖీమ్‌పూర్‌ హింస కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనస్తత్వాన్ని బహిర్గతం చేసిందని సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్లౖపైకెక్కినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ జరుగుతున్న ఉగ్ర దాడులకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సోనియా అన్నారు. దేశ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక సంస్కరణల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటోందని, ప్రతిదీ విక్రయించాలన్న ఒకే ఒక ఎజెండా ప్రస్తుతం కేంద్రానికి ఉందని సోనియా విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వ వైఫల్యం
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ దేశంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఒక రాజకీయ తీర్మానాన్ని చేసింది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ ఆ తీర్మానంలో ప్రస్తావించింది. లద్దాఖ్‌ ఘటన జరిగి 18 నెలలు అయినప్పటికీ చైనా సైనికులు ఇప్పటికీ భారత భూభాగంలో ఆక్రమణలు కొనసాగిస్తున్నారని సీడబ్ల్యూసీ విమర్శించింది. పాకిస్తాన్‌ చొరబాట్లు జమ్మూకశ్మీర్‌ భద్రతను గణనీయంగా దిగజార్చాయని ఆరోపించింది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, మిజోరంలలో భద్రతకు ముప్పు పెరుగుతోందని, సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య అకస్మాత్తుగా అంతర్‌ రాష్ట్ర వివాదాలు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా  కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ పతనం చాలా ఆందోళన కలిగిస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మహమ్మారి కారణంగా కోల్పోయిన ఉద్యోగాల కల్పనపై కేంద్రం దృష్టి సారించలేదని, ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర అధిక ధరలతో కష్టాలను ఎదుర్కొంటున్నారని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది.

సంస్థాగత షెడ్యూల్‌ ఇదీ..
సీడబ్ల్యూసీ నిర్ణయాలను సమావేశం అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా మీడియాకు వివరించారు.  త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి కార్యకర్తల వరకు పెద్దఎత్తున శిక్షణ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను 2022 ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య ఖరారు చేస్తారు. ప్రాథమిక కమిటీలు, బూత్‌ కమిటీలు, బ్లాక్‌ కమిటీల అధ్యక్షుల ఎంపికకు ఏప్రిల్‌ 16 నుంచి మే 31 వరకు ఎన్నిక జరుగనుంది.

వచ్చే ఏడాది జూలై 21 నుంచి ఆగస్ట్‌ 20 వరకు పీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి,íపీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్లీ్నరీ సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ధరల పెరుగుదలపై నవంబర్‌ 14 నుంచి 29 వరకు పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుందని పేర్కొన్నారు.

పరివార్‌ బచావో వర్కింగ్‌ కమిటీ: బీజేపీ ఎద్దేవా
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ‘పరివార్‌ బచావో(కుటుంబాన్ని కాపాడే) వర్కింగ్‌ కమిటీ’ అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అంతర్గత వైషమ్యాలకు ఈ సమావేశం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించింది. పార్టీ నాయకత్వ వైఫల్యంపై చర్చించడానికి బదులు అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికే సీడబ్ల్యూసీ భేటీ జరిగినట్లు బీజేపీ ప్రతినిధి గౌరవ్‌ భాటియా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు