అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం

18 Mar, 2023 04:06 IST|Sakshi

బెళగావి: అస్సాంలోని అన్ని మదర్సా (ముస్లిం మత పాఠశాల)లను మూసి వేస్తామని ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం అవసరం లేదని చెప్పారు. ‘దేశానికి, అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉంది. మదర్సాలతో కాదు’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశాం, మిగతా వాటినీ మూసేస్తామని అన్నారు.

కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యం బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్న జనంతో మన సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ‘మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలి’అని హిమాంత చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించారు.  కాంగ్రెస్‌ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారు..కాంగ్రెస్‌ ఇప్పుడదే చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు