అనుక్షణం అప్రమత్తం

9 Oct, 2021 04:36 IST|Sakshi

భారత వాయుసేన చీఫ్‌ వి.ఆర్‌. చౌధరి

హిండన్‌ (యూపీ): సరిహద్దుల్లో అనుక్షణం త్రివిధ బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయని భారత వాయుసేన చీఫ్‌ వి.ఆర్‌. చౌధరి చెప్పారు. గత ఏడాది తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో డ్రాగన్‌ కుయుక్తుల్ని తిప్పికొట్టడమే దీనికి సాక్షీభూతంగా నిలుస్తుందని అన్నారు. శుక్రవారం 89వ భారత వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌ వద్ద విఆర్‌ చౌధరి మాట్లాడుతూ వైమానిక దళంలో బలగాలకు మరింత శిక్షణ అవసరమని అన్నారు. యువ అధికారులు మరింత రాటు దేలేలా శిక్షణ ఇవ్వడానికి అనుభవం కలిగిన అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన దేశ భూభాగంలోకి విదేశీ శక్తులు రాకుండా ఉండేలా మన శక్తిని చూపించాలని ఆయన వ్యాఖ్యానించారు. మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని, స్పష్టమైన లక్ష్యాలతో సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానిని ప్రతిజ్ఞ చేస్తున్నానని పేర్కొన్నారు.

అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉందన్నారు. యువ ఆఫీసర్లకు ఆయా టెక్నాలజీలను వాడేలా శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. వాయుసేనలోని బృంద సభ్యులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 75 యుద్ధ విమానాలతో ఎయిర్‌షో నిర్వహించారు. వైమానిక దళం ఆధునీకరణలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చెప్పారు. సరిహద్దులో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి, క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేలా బలగాలను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఆర్మీ జనరల్‌ ఎంఎం నరవాణె హాజరయ్యారు. భారత వాయుసేన దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఏఎఫ్‌ బృందాలకు శుభాకాంక్షలు చెప్పారు.  

మరిన్ని వార్తలు