హౌసింగ్‌ బోర్డు ఆఫీసులో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌తో ప్రాణం నిలిపిన ఐఏఎస్‌

19 Jan, 2023 15:42 IST|Sakshi

ఇటీవలే బెంగళూరులో ఐకియా మాల్‌లో ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, మాల్‌లో ఉన్న ఓ డాక్టర్‌ వెంటనే స్పందించి సీపీఆర్‌(కార్డియో పల్మనరీ రిసిటేషన్‌) బాధితుడి ఛాతిపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. తాజాగా ఇలాంటి ఘటనే చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఓ ‍వ్యక్తి కూర్చీలోనే కుప్పకూలిపోవడంతో ఆఫీసులో ఉన్న ఐఏఎస్‌ అధికారి వెంటనే స్పందించిన సీపీఆర్‌ చేసి ప్రాణాలను రక్షించాడు. 

వివరాల ప్రకారం.. చండీగఢ్‌ సెక్టార్‌-41కు చెందిన జనక్‌ లాల్‌ మంగళవారం చండీగఢ్‌ హౌసింగ్‌ బోర్డు కార్యాలయానికి వెళ్లారు. తన ఇంటికి సంబంధించి ఉల్లంఘన కేసుపై అధికారులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు వచ్చినట్టు గమనించిన  ఆరోగ్యశాఖ కార్యదర్శి ఐఏఎస్‌ యశ్‌పాల్ గార్గ్  అతడి వద్దకు చేరుకుని సీపీఆర్‌ చేశారు. ఛాతిపై రెండు చేతులతో నొక్కుతూ సీపీఆర్‌ చేశారు. 

 ఈ క్రమంలో రెండు నిమిషాల్లోనే జనక్‌ లాల్‌ స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరిచి అక్కడున్న వారి చూసి పర్వాలేదంటూ చేతులతో సైగా చేశారు. దీంతో, ప్రాణాపాయ స్థితి నుంచి జనక్‌ లాల్‌ బయటపడ్డారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. యశ్‌పాల్‌ గార్గ్‌కు అసలు సీపీఆర్‌ గురించే తెలియదని.. ఇటీవలే ఓ టీవీలో చూసి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నట్టు చెప్పారు. ఇక, జనక్‌ లాల్ ప్రాణాలు కాపాడిన గార్గ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

మరిన్ని వార్తలు