Bihar Bridge Collapse: గాలొచ్చి బ్రిడ్జి కూలిందట

10 May, 2022 05:08 IST|Sakshi

ఐఏఎస్‌ వివరణకు షాకయ్యా: గడ్కరీ

న్యూఢిల్లీ: ‘గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది’ – కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్‌ గడ్కరీకి ఓ ఐఏఎస్‌ అధికారి ఇచ్చిన వివరణ ఇది. దాంతో విస్తుపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని సోమవారం ఓ సమావేశంలో మంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్‌ 29న కూలిపోయింది.

దీనిపై సంబంధిత ఐఏఎస్‌ అధికారిని వివరణ కోరితే పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారన్నారు మంత్రి. ‘‘ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే’’ అని అభిప్రాయపడ్డారు. 3.12 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైందిగా నిలవనుంది.  

మరిన్ని వార్తలు