అప్పట్లో సంచలనం రేపిన ఆ ఇద్దరు ఐఏఎస్‌లకు విడాకులు

11 Aug, 2021 10:46 IST|Sakshi

2015 సివిల్స్‌ టాపర్లు టినా దాబి, అథార్‌ ఖాన్‌

2018లో పెళ్లి చేసుకుని సంచలనం

ఏమైందో ఏమోగానీ తాజాగా విడాకులు

జైపూర్‌ ఫ్యామిలీ కోర్టు తీర్పుతో విడిపోయిన జంట

జైపూర్‌: ఐఏఎస్‌ టాపర్లుగా నిలవడంతో పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే వారి పెళ్లి తీవ్ర వివాదాస్పదమైంది. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయితే తాజాగా ఆ దంపతులు విడిపోయారు. అధికారికంగా న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ ఇద్దరే టినా దాబి, అథార్‌ ఖాన్‌.

టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్‌ సాధించి సంచలనం సృష్టించింది. అదే ఏడాది కశ్మీర్‌కు చెందిన అథార్‌ ఖాన్‌ రెండో ర్యాంక్‌ సాధించాడు. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి​కి రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు హాజరై అభినందించి ప్రశంసించారు. టినా ఢిల్లీలోని శ్రీరామ్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. టీనా, అథార్‌ ఖాన్‌ తొలి ప్రయత్నంలోనే టాప్‌ ర్యాంక్‌లు సాధించి సంచలనం సృష్టించారు.

రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమలోనూ.. పాలనలోనూ ఈ జంట విజయవంతంగా రాణించారు. అయితే ఏమైందో ఏమోగానీ ఇప్పుడు టినా, అథార్‌ విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ మంగళవారం విడాకులు మంజూరు చేసింది. మెరుగైన పాలన అందిస్తూ అందరి నోళ్లల్లో నానిన వీరు విడాకులు తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాజకీయ, ఇతర ప్రముఖుల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన ఆ దంపతులు విడిపోవడం షాకిచ్చింది. అయితే ఈ విడాకుల వెనుక కొందరి బెదిరింపులు ఉన్నాయని సమాచారం. పెళ్లి వివాదాస్పదం కావడంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు