మహిళా ఐపీఎస్, ఐఏఎస్‌ల గొడవ.. సర్కారు సీరియస్‌.. ఇద్దరికీ నోటిసులు

21 Feb, 2023 05:07 IST|Sakshi
రోహిణి సింధూరి, రూపా మౌద్గిల్‌

బనశంకరి: కర్ణాటకలో ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం సోమవారం ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్‌ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోహిణిపై రూపా ఫేస్‌బుక్‌ ద్వారా తీవ్ర ఆరోపణలను గుప్పించారు. సోమవారం రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.

మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుధీర్‌ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్‌ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్‌ను బ్లూటూత్‌ ద్వారా హ్యాక్‌ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు