మరో 6–8 వారాలు లాక్‌డౌన్‌ ఉండాలి

13 May, 2021 06:18 IST|Sakshi

ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరో 6 నుంచి 8 వారాల పాటు కొనసాగించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధిపతి డాక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ అభిప్రాయపడ్డారు. సుమారు 500 జిల్లాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10% పైన ఉందని, ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని భార్గవ్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎంతకాలం అవసరమనే విషయాన్ని డాక్టర్‌ భార్గవ్‌ వివరించారు. అయితే వైరస్‌ సంక్రమణ ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి వచ్చిన తర్వాతనే ఆంక్షలను సడలించాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 5% పాజిటివిటీ రేటు వచ్చేందుకు దాదాపు 8 వారాలు పడుతుందన్నారు. ఢిల్లీ విషయాన్ని ఉదహరిస్తూ గతంలో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుందని, కానీ ఇప్పుడు అది కాస్తా 17 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు. ఉన్నపళంగా ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేస్తే అది మరో విపత్తుకు కారణమౌతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు