అలా చేస్తేనే మూడో వేవ్‌ వచ్చినా.. ప్రభావం ఉండదు

24 Jun, 2021 01:22 IST|Sakshi

ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ 

న్యూఢిల్లీ: ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో వేవ్‌ ప్రభావం పెద్దగా ఉండబోదని ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అప్రమత్తతో ఉండడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందని, తద్వారా దేశ వైద్య రంగంపై ఒత్తిడి పెద్దగా ఉండదన్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 2.2% మంది కరోనా బారిన పడ్డారన్నారు. ‘జాగ్రత్తలు మరవద్దు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అలా చేస్తే, ఒకవేళ మూడో వేవ్‌ వచ్చినా, పెద్ద ప్రభావం చూపబోదు. అలాగే, వైద్య వ్యవస్థను ఒత్తిడిలోకి తీసుకువెళ్లే స్థాయిలో కేసుల సంఖ్య ఉండదు’ అన్నారు.

వివిధ అపోహల కారణంగా ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇంకా టీకా పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని, కోవిడ్‌పై పోరులో అదే పెద్ద సవాలని అగర్వాల్‌ పేరొన్నారు. సోషల్‌ మీడియాతో కూడా వ్యాక్సిన్ల విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందన్నారు. కరోనా జాగ్రత్తలను ప్రచారం చేయడంతో పాటు, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అపార్ధాలను తొలగించడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందన్నారు.

యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఒక మీడియా వర్క్‌షాప్‌లో అగర్వాల్‌ మాట్లాడారు. రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను వేసుకోవడంపై మీడియా ప్రశ్నకు మరో అధికారి వీణా ధావన్‌ సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న డేటా ప్రకారం వేర్వేరు డోసులకు వేర్వేరు టీకాలను వేసుకోవడం సరికాదన్నారు. టీకాకు తీవ్రమైన దుష్ప్రభావాలేమైనా ఉంటే.. టీకా తీసుకున్న మొదటి అరగంటలోనే తెలుస్తుందని, అందువల్లనే అరగంట అబ్జర్వేషన్‌ను తప్పనిసరి చేశామన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు