మాల్స్‌ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?

8 Sep, 2020 16:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావం సమాజంలోని ప్రతి రంగంపై పడింది. చివరకు న్యాయ వ్యవస్థ కూడా తప్పించుకోలేక పోయింది. కోవిడ్‌ మహమ్మారి నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా హైకోర్టుల్లో 50 శాతం కేసులను పెండింగ్‌లో వేయాల్సిరాగా, జిల్లా కోర్టుల్లో 70 శాతం కేసులను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కీలకమైన కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో విచారిస్తూ వస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఇప్పట్లో పోయే అవకాశం కనించక పోవడంతో కేసుల భౌతిక విచారణను పునరుద్ధారించాలంటూ న్యాయవర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలోనే పరిమితంగానైనా కొన్ని కేసుల విచారణను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఓ వెయ్యి కేసుల జాబితాను రూపొందించింది. (త్వరలోనే ప్రత్యక్ష విచారణ చేపట్టనున్న కోర్టులు?)

వాటి విచారణకు ప్రాతినిథ్యం వహించాల్సిందిగా న్యాయవాదులను కోర్టు కోరింది. అందుకు ఆశ్చర్యంగా ఒక్క శాతం న్యాయవాదులు మాత్రమే కేసుల వాదనకు కోర్టుకు హాజరయ్యేందుకు అంగీకరించారు. కేసుల పునరుద్ధరణ కు సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చినప్పటికీ ఇంత తక్కువ సఖ్యలో న్యాయవాదులు స్పందించడం శోచనీయంగా కనిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు, దాని దిగువ కోర్టులు గత వారం నుంచి పని చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో హైకోర్టులతోపాటు వాటి దిగువ కోర్టుల్లో ఇంకా కేసుల విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఎక్కువ లిటిగేషన్‌ కేసుల విచారణ కొనసాగుతాయి. అవే న్యాయవాదులకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉపయోగపడుతూ వస్తున్నాయి. సబార్డినేట్‌ కోర్టుల్లో ఇంకా కేసుల విచారణ ప్రారంభం కాకపోవడంతో జిల్లా, గ్రామీణ స్థాయిలో న్యాయవాదులు ఆర్థిక సంక్షోభం చిక్కుకు పోయారు. సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచి కేసుల విచారణను పునరుద్ధరిస్తున్నట్లు మద్రాస్‌ హైకోర్టు ఇటీవలనే ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రోజుకు మూడు నుంచి ఐదు కేసులను విచారించాలని నిర్ణయించింది. (న్యాయస్థానాలు మూడో సభ కానున్నాయా?)

కొత్త కేసులను దాఖలు చేసేందుకు కోర్టు ఆవరణలో డ్రాప్‌ బాక్సులను  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ యంత్రాంగాలన్నీ తమ కార్యకలాపాలను పునరుద్ధరించినప్పుడు న్యాయవర్గాలు మాత్రం ఎందుకు తమ కార్యకలాపాలను పునరుద్ధరించరన్నది ప్రశ్న. హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాలంటూ అస్సాంలో న్యాయవాదులంతా ధర్నాలు చేయగా, కొన్ని ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేనందున ఇప్పుడే కేసుల విచారణ చేపట్టరాదని న్యాయవాదులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, మాల్స్‌ను తెరచారని, మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వాటిని తెరవబోతున్నారని, అలాంటప్పుడు కోర్టుల కార్యకలాపాలను పునరుద్ధరిస్తే తప్పేమిటని న్యాయవాదుల్లో ఓ వర్గం వాదిస్తోంది. 

మరిన్ని వార్తలు