యువతి రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తే.. లైంగిక వేధింపుల కేసు చెల్లదు.. కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు

17 Aug, 2022 20:05 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌ జిల్లా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల కేసు నిలబడదని వ్యాఖ్యనించింది. లైంగిక వేధింపుల కేసులోని నిందితుడిగా ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త సివిక్‌ చంద్రన్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ  కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) ప్రకారం మహిళ లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు ఆ ఫిర్యాదు చెల్లదని తెలిపింది.

అసలేం జరిగిందంటే..ఈ ఏడాది ఫిబ్రవరి 8న కోజికోడ్‌ జిల్లాలోని నంది బీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఓ కవితా శిబిరంలో చంద్రన్‌ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాంప్‌ నుంచి తిరిగి వస్తుండగా తన చేయి పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని ఆరోపించింది. అక్కడ తన ఒళ్లో కూర్చోవాలని అడిగాడని, ఛాతీ నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత కూడా తనకు పదే పదే ఫోన్‌లు చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపింది. యువతి ఫిర్యాదులో చంద్రన్‌పై 354ఎ (2), 341, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
చదవండి: రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం 

ఈ కేసుపై కోజికోడ్‌ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోజికోడ్ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.కృష్ణకుమార్.. చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. తీర్పు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. యువతి చేసిన ఫిర్యాదు నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. నిందితుడు బెయిల్‌ దరఖాస్తుతోపాటు అందజేసిన ఫోటోగ్రాఫ్స్‌ను పరిశీలిస్తే యువతి(బాధితురాలు) ఆ సమయంలో కావాలనే లైంగికంగా ప్రేరేపించే దుస్తులను ధరించినట్లు ఉందని అన్నారు.

సెక్షన్‌ 354ఏ ప్రకారం అమ్మాయి రెచ్చ‌గొట్టే దుస్తులు ధ‌రిస్తే ఈ కేసు నిలబడదన్న జడ్జి.. 74 ఏళ్ల దివ్యాంగుడైన చంద్రన్‌ యువతిని బలవంతంగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఛాతిని నొక్కాడనే అరోపణలు నమ్మేలా లేవని తోసిపుచ్చారు. కాబట్టి నిందితుడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు