కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్‌ నదవ్‌ లపిడ్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘అదో చెత్త సినిమా’

29 Nov, 2022 09:15 IST|Sakshi

పణజీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) జ్యూరీ హెడ్‌ నదవ్‌ లపిడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్‌ ఫైల్స్‌ చూసి మేమంతా షాకయ్యాం. చాలా డిస్టర్బయ్యాం. ఫక్తు ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అది’’ అంటూ సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా వేదికపైనే కడిగి పారేశారు.

అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్‌ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు. ‘‘ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్‌ ఫైల్స్‌ చూసి అక్షరాలా షాకయ్యాం. కళాత్మక స్పర్థకు వేదిక కావాల్సిన ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అస్సలు సరికాదు.

అందుకే నా అభ్యంతరాలను, అభిప్రాయాలను వేదికపై ఉన్న అందరి ముందే వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు. 1990ల్లో కశ్మీర్‌ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, ఫలితంగా లోయనుంచి వారి భారీ వలసలు నేపథ్యంగా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్‌ ఫైల్స్‌ ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. అయితే పలు వివాదాలకూ ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్తవాలను వక్రీకరించారంటూ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. లపిడ్‌ ఇజ్రాయెల్‌కు చెందిన సినీ దర్శకుడు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ అవార్డుల గ్రహీత. కేన్స్‌ వంటి అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో జ్యూరీ సభ్యునిగా చేశారు. 

మరిన్ని వార్తలు