జాబ్‌ నోటిఫికేషన్‌ తప్పుగా ఇచ్చిన ఐఐటీ!

8 Sep, 2020 08:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నలభై ఐదు వేల రూపాయల జీతం అంటే తక్కువేమీ కాదు. వెన్ను విరిచే ప్రీ పెయిడ్‌ బాధ్యతలు ఏమీ లేకుంటే ఢిల్లీలోనైనా.. ‘వీధి వీధి నీదే బ్రదరూ.. ’ అని పాడుకోకుండా బతికేయొచ్చు. జీతం ఎంతో తెలిసింది కదా.. ఇప్పుడు పోస్ట్‌ ఏమిటో చూడండి. డాగ్‌ హ్యాండ్లర్‌. శునకం బాగోగులను చూసుకోవడం. ఒకటే శునకం. ఒకటే పోస్టు. ఢిల్లీ ఐ.ఐ.టి.లో పోస్టింగ్‌. బహుశా అది ఆ విద్యా ప్రాంగణంలోని ఓ అధికార నివాస గృహ జాగిలం అయి ఉండొచ్చు. వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ కోసం ఐ.ఐ.టి. ప్రకటన ఇచ్చింది. 20–35 ఏళ్ల వయసు కలిగి, బి.ఎ. లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీటెక్‌ చేసిన వారెవరైనా నేరుగా ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు. (ఇప్పుడు కాదులెండి. సెప్టెంబర్‌ 5 నే ఇంటర్వ్యూలు అయిపోయాయి).

అయితే డాగ్‌ హ్యాండ్లర్‌ పోస్ట్‌కి ఈ డిగ్రీలు ఎందుకు అని పట్టభద్రులైన పిల్లలు ఆ నోటిఫికేషన్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సెటైర్‌ లు వెయ్యడం మొదలు పెట్టారు. ఓ సెటైర్‌ వి.రామగోపాల్‌ రావ్‌ గారికి కూడా తగిలింది. ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఆయన. వెంటనే ట్విట్టర్‌లోకి వెళ్లారు. ‘మనుషులన్నాక మిస్టేక్స్‌ జరుగుతుంటాయి. వెటెరినరీ సైన్సెస్‌లో డిగ్రీ చేసిన వాళ్లు.. అని ఇవ్వబోయి బై మిస్టేక్‌ బీటెక్‌ లు, మిగతా డిగ్రీలు ఇచ్చాము. ఈ సంగతిని ఇక్కడితో వదిలేయండి..’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఆయన మాత్రం వదిలేయలేదు! ‘అయినా జాబ్‌ డిస్క్రిప్షన్‌ చూస్తే తెలియట్లేదా.. వెటెరినరీ చదివిన వాళ్లు కావాలని.. అవన్నీ మీరే చూస్కోవాలి’ అని తిరుగు మాట ఒకటి వేశారు. తప్పును పూర్తిగా ఒప్పేసుకుంటే మళ్లీ అదొక తప్పు అవుతుందనుకున్నారో ఏమో ఐ.ఐ.టి.డైరెక్టర్‌.

చదవండి: భారత్‌ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. అర్ధరాత్రి కాల్పులు

మరిన్ని వార్తలు