‘అష్ట’కష్టాల్లో ఐఐటీలు!

30 Dec, 2021 04:28 IST|Sakshi

దేశంలో 2008–09లో మొదలైన 8 ఐఐటీల్లో సమస్యలు

విద్యార్థులకు సరిపడా అధ్యాపకుల్లేక ఇబ్బందులు

పరిశోధన పత్రాల ప్రచురణ, పేటెంట్లలో వెనుకబాటు

ప్లేస్‌మెంట్లలో హైదరాబాద్‌ ఐఐటీ లాస్ట్‌.. పేటెంట్‌లలో ఫస్ట్‌

2014–19 మధ్య చేసిన పరిశీలనలను వెల్లడించిన కాగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్‌డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. ఐఐటీ హైదరాబాద్‌ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్‌ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 

5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు 
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్‌ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23 శాతం అధ్యాపకుల కొరత ఉందని కాగ్‌ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్‌టేక్‌ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది.  

హైదరాబాద్‌ ఐఐటీలో ప్లేస్‌మెంట్స్‌ 63 శాతమే 
ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్‌మెంట్‌ అనేది ర్యాంకింగ్‌ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్‌ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్‌మెంట్‌ శాతం కేవలం 63గానే ఉందని కాగ్‌ వివరించింది. 95 శాతం ప్లేస్‌మెంట్స్‌ ఇండోర్, 84 శాతం ప్లేస్‌మెంట్స్‌తో భువనేశ్వర్‌ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్‌ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్‌ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్‌ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్‌డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది.

పేటెంట్లలో హైదరాబాద్‌ ఐఐటీ టాప్‌
ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్‌ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్‌ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్‌పూర్‌ 4, ఐఐటీ రోపార్‌ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. 

కాగ్‌ ఏం సూచించిందంటే..
ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్‌ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్‌ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

మరిన్ని వార్తలు