మన పరిశోధకుల ఘనత.. శ్వాసతోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు!

19 Oct, 2022 07:11 IST|Sakshi

రూర్కీ: రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను వ్యయప్రయాసలు లేకుండా కేవలం శ్వాస ఆధారంగానే కనుగొనే కొత్త విధానాన్ని ఐఐటీ–రూర్కీ పరిశోధకులు అభివృద్ధిచేశారు. ప్రొఫెసర్‌ ఇంద్రాణి లాహిరి, ప్రొఫెసర్‌ పార్థా రాయ్, ప్రొఫెసర్‌ దిబ్రుపా లాహిరి తదితరులు రూపొందించిన ఈ డిటెక్టర్‌ రంగుల వేర్వేరు గాఢతలను వివరించే కలరీమెట్రీ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ‘ చిన్న పరిమాణంలో ఉండే ఈ స్క్రీనింగ్‌ డివైజ్‌ను ఉపయోగించడం చాలా తేలిక. ఈ డివైజ్‌లోకి సంబంధిత వ్యక్తి గట్టిగా గాలి ఊదితే చాలు వెంటనే డివైజ్‌లో ఒక కలర్‌ కనిపిస్తుంది.

ఏ రోగానికి ఏ రంగు అనేది ముందే నిర్దేశితమై ఉంటుందిగనుక వాటిని పోలిచూసి రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లలో ఏదైనా వ్యాధి ప్రబలిందా లేదా చెక్‌ చేయవచ్చు’ అని పరిశోధనలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్‌ ఇంద్రాణి లాహిరి వివరించారు. ‘క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే కనుగొంటే చాలా ఉత్తమం. అప్పుడే దాని నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని ఐఐటీ–రూర్కీ తాత్కాలిక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎంఎల్‌ శర్మ అన్నారు. ‘ఈ ఉపకరణంతో కోట్లాదిమంది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రాణాంతక రోగం ముదిరి వ్యాధి చికిత్సకు లక్షలు పోసే బదులు ముందే వ్యాధిని గుర్తించేందుకు ఇది సాయపడనుంది’ అని ఆయన అన్నారు.

ఈ పరికరం ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దీని సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. డిటెక్టర్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు టాటా స్టీల్‌తో సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని ఐఐటీ–రూర్కీ చేసుకుంది. హెల్త్‌ టెక్నాలజీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ జ్ఞానాన్ని ఒడిసిపట్టేందుకే టెక్నాలజీ, న్యూ మెటీరియల్స్‌ బిజినెస్‌ పేరిట టాటా స్టీల్‌ విడిగా ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తోంది. ఆరోగ్య ఉపకరణాల రంగంలో స్వావలంబనకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ప్రధాని మోదీ నినదించిన ఆత్మనిర్భరత భారత్‌ కోసం శ్రమిస్తోంది.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కోసం రక్తం అమ్ముకునే యత్నం..

మరిన్ని వార్తలు