Viral Video: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్‌ని..ఏకంగా 60 డైనమైట్‌లతో ధ్వంసం

4 Jan, 2023 10:40 IST|Sakshi

సాక్షి, ఇండోర్‌: మధ్యప్రదేశ్ అధికారులు సాగర్‌ నగర్‌లో ఉన్న  బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ర గుప్తా అక్రమ హోటల్‌ని కూల్చేసింది. చంద్ర గుప్తా అతని కుటుంబ సభ్యులపై డిసెంబర్ 22న జగదీష్‌ యాదవ్‌ అనే వ్యక్తిని ఎస్‌యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు.

అయితే దర్యాప్తులో చంద్ర గుప్తా పేరిట ఉన్న హోటల్‌ అక్రమంగా కట్టిందని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇండోర్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్‌ జైరామ్‌ ప్యాలస్‌ని సుమారు 60 డైనమైట్‌లను ఉపయోగించి కూల్చేసినట్లు సమాచారం. సెకండ్ల వ్యవధిలో నేలమట్టం అయ్యింది ఆ హోటల్‌. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

సాగర్‌జిల్లా కలెక్టర్‌ దీపక్‌ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్‌ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివశించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్‌ ఆర్య ప్రకటించారు.

హత్యకు గురైన జగదీష్‌ యాదవ్‌ స్వతంత్ర​ కౌన్సిలర్‌ కిరణ్‌ యాదవ్‌ మేనల్లుడు. కిరణ్‌ యాదవ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో  ఓడించడం గమనార్హం.

(చదవండి: గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్‌ కేసులో జైలు శిక్ష.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా)

మరిన్ని వార్తలు