ఎల్‌నినో ఉన్నా మంచి వానలే! వర్షాభావ పరిస్థితులపై స్పందించిన భారత వాతావరణ శాఖ

12 Apr, 2023 10:07 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ‘ఎల్‌ నినో’ దాపురించే అవకాశాలు ఉన్నాసరే ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణస్థాయిలో కొనసాగి వ్యవసా య రంగానికి మేలుచేకూర్చనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం అంచనావేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్‌ సోమవారం ప్రకటించిన మరుసటి రోజే వాతావరణ శాఖ మరోలా అంచనాలు వెల్లడించడం గమనార్హం.

భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడింది. మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు 52 శాతం భూభాగం వర్షాధారం. దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం.. ఈ భూభాగంలో పండించే పంట నుంచే వస్తోంది. ఇది దేశ ఆహారభద్రతకు, ఆర్థిక సుస్థిరతకు కీలక భూమికగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనావేసి వ్యవసాయరంగానికి ఐఎండీ తీపికబురు మోసుకొచ్చింది. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కితే ఎల్‌ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో రుతుపవన గాలులు బలహీనమై పొడిబారి వర్షాభావం తలెత్తుతుంది.

సగటు వానలు
జూన్‌ నుంచి సెప్టెంబర్‌ దాకా నైరుతి సీజన్‌లో దాదాపుగా సుదీర్ఘకాల సగటు అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్ర భూ శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌ చెప్పారు. సాధారణం, అంతకు ఎక్కువ వానలు పడేందుకు 67 శాతం ఆస్కారముందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్ర అంచనావేశారు. ‘‘రెండో అర్ధభాగంపై ఏర్పడే ఎల్‌నినో ప్రభావం చూపొచ్చు. అంతమాత్రాన వర్షాభావం ఉంటుందని చెప్పలేం. ఎన్నోసార్లు ఎల్‌నినో వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైంది’’ అని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు