వాయుగుండంపై వాతావరణ శాఖ హెచ్చరిక.. 11 జిల్లాలకు అలర్ట్‌!

31 Jan, 2023 11:38 IST|Sakshi

బంగాళాఖాతంలో (శ్రీలంక సమీపంలో) ఏర్పడిన అల్పపీడణ ద్రోణి క్రమంగా బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఫలితంగా తమిళనాడులోని సముద్ర ప్రభావిత జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. కాగా అకాల వర్షం వల్ల కొన్నిచోట్ల పంటనష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సాక్షి, చెన్నై: రాష్ట్రానికి మరో వాయుగండం ఎదురుకానుంది. ఫలితంగా దక్షిణ తమిళనాడు సహా డెల్టా జిల్లాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక సముద్రంలో గాలి ప్రభావం అధికంగా ఉండడంతో వేటకు వెళ్ల వెళ్లొద్దని జాలర్లను వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. వివరాలు.. రాష్ట్రంలో గత ఏడాది ఈశాన్య రుతు పవనాల వల్ల వర్షాలు ఆశాజనకంగానే కురిశాయి.

ముఖ్యంగా ఉత్తర తమిళనాడు, కొంగు మండలం, డెల్టా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. అయితే దక్షిణ తమిళనాడులో ఈశాన్య రుతు పవనాల ప్రభావం తక్కువే. ఇక గత నెలాఖరుతోనే ఈశాన్య రుతు పవనాల సీజన్‌ ముగిసింది. వర్షాలు పూర్తిగా కనుమరుగైనట్లే అని కూడా వాతావరణ కేంద్రం ప్రకటించింది. కానీ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి, సోమవారం వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

లోతట్టు ప్రాంతాలపై దృష్టి.. 
దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, రామనాథపురం, డెల్టాలోని నాగపట్పం, మైలాడుతురై, పుదుకోట్టై తదితర సముద్ర తీర జిల్లాల్లో ఈనెల 31న మోస్తారు వర్షం, ఫిబ్రవరి ఒకటో తేదీన అనేక భారీ వర్షం పడే అవకాశాలు ఉంది. ఇక రాజధాని నగరం చెన్నై, శివారు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉందని వివరించారు. సోమవారం చెన్నై శివారు ప్రాంతాలతో పాటు డెల్టా జిల్లాలో అనేక చోట్ల వర్షం స్వల్పంగా కురిసింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో 11 జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సముద్రంలో శ్రీలంక వైపుగా గాలి ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. జాలర్లు వేటకు వెళ్లొద్దని, సముద్రంలోకి వెళ్లిన వారు సైతం తిరిగి రావాలని సూచించారు.

మరిన్ని వార్తలు