వణుకుతున్న వాయవ్య భారతం

20 Dec, 2021 05:12 IST|Sakshi
గుల్మార్గ్‌లో మంచులో పర్యాటకుల సందడి

రాజస్తాన్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన కనీస ఉష్ణోగ్రతలు

ఫతేపూర్‌లో మైసస్‌ 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

పంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలోనూ భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు  

జైపూర్‌: శీతగాలులు వాయవ్య భారతాన్ని వణికిస్తున్నాయి. రాజస్తాన్, పంజాబ్‌లలో గడ్డకట్టించే చలితో జనం గజగజ వణికిపోతున్నారు. వరుసగా రెండోరోజు కూడా రాజస్తాన్‌లోని ఫతేపూర్, చురుల్లో రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఫతేపూర్‌లో మైనస్‌ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్‌ 2.6 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. గడిచిన 12 ఏళ్లలో చురులో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆదివారం సికార్, కరౌలి, చిత్తోర్‌గఢ్‌ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సికార్‌లో మైనస్‌ 2.6 డిగ్రీలు, కరౌలీలో మైనస్‌ 0.6, చిత్తోర్‌గఢ్‌లో మైనస్‌ 0.2 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భిల్వారాలో జీరో డిగ్రీలు, పిలానీలో 0.1, నాగౌర్‌లో 0.2, అల్వార్‌లో 0.4, బనస్థలిలో 1.5, సంగారియాలో 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అమృత్‌సర్‌లో మైనస్‌ 0.5 డిగ్రీలు  
హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ కూడా చలి గుప్పిట్లో గజగజ వణికిపోతున్నాయి. అమృత్‌సర్‌లో మైనస్‌ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హల్వారాలో జీరో డిగ్రీలు, భటిండా 0.1, ఫరీద్‌కోట్‌లో 1, పటాన్‌కోట్‌లో 1.5 డిగ్రీలకు శనివారం రాత్రి కనిష్ట ఉప్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం తీవ్ర చలిగాలు వీచాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. అమర్‌నాథ్‌ యాత్రకు బేస్‌క్యాంప్‌ అయిన కశ్మీర్‌లోని గుల్మార్గ్‌ రిసార్ట్‌లో మైనస్‌ 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బారాముల్లాలో మైనస్‌ 6.5 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్‌ 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాగునీటిని సరఫరా చేసే పైపుల్లో మంచు గడ్డకట్టుకుపోయింది.  పలు సరస్సులు గడ్డకట్టాయి. కాకపోతే కశ్మీర్‌ ప్రజలకు ఇది అలవాటే కాబట్టి తట్టుకోగలుగుతున్నారు.  
 

మరిన్ని వార్తలు