వడగాలుల ముప్పు; ఉత్తర భారతదేశానికి ఐఎండీ హెచ్చరిక

1 Jul, 2021 18:45 IST|Sakshi

ఢిల్లీ: ఉత్తర భార‌త‌దేశానికి వ‌డ‌గాలుల ముప్పు ఉంద‌ంటూ భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ (ఐఎండీ) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్‌ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయ‌ని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, రాజ‌స్థాన్, హ‌ర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌పై వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే జ‌మ్మూక‌శ్మీర్‌లో పలు చోట్ల వేడి గాలులు వీస్తున్నట్లు ఐఎండీ గుర్తించింది. పాకిస్తాన్‌లో పొడి గాలుల‌తో ఉష్టోగ్రతలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6.5 డిగ్రీలు అధికంగా న‌మోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది.

ఇదే విషయమై ఐఎండీ అధికార ప్రతినిధి కుల్దీప్‌ శ్రీవాత్సవ స్పందించారు. '' మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు "హీట్ వేవ్'' అని ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా వర్షాకాలం సీజన్‌లోనూ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.సాధారణంగా, జూన్ 20 వరకు దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వేడి తరంగాలు రావడం సహజమే. కానీ ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత పెరగడం వెనుక రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కారణం'' అని చెప్పుకొచ్చారు.

ఇక అమెరికాతో పాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక కెనడాలోని వెన్‌కౌర్‌ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. ఫసిఫిక్‌ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్‌ డోమ్‌ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్‌ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్‌ఫాదర్‌ చెప్పారు

మరిన్ని వార్తలు