‘స్వీయ నియంత్రణ’పై సూచనలివ్వండి!

19 Sep, 2020 06:38 IST|Sakshi

‘సుదర్శన్‌ టీవీ’ కేసులో కేంద్రానికి, ఎన్‌బీఏకు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ మీడియా పాటించాల్సిన స్వీయ నియంత్రణ విధానానికి సంబంధించి సూచనలు పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. సభ్యులుగా ఉన్నవారు, సభ్యులు కాని వారిపై ఎన్‌బీఏకు ఒకే విధమైన నియంత్రణ ఉండేలా సూచనలు ఇవ్వాలని కోరింది. ఎలక్ట్రానిక్‌ మీడియాలో స్వీయ నియంత్రణ విధానం సరిగ్గా లేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పై ఆదేశాలు జారీ చేసింది.

‘యూపీఎస్సీ జీహాద్‌’ పేరుతో ‘సుదర్శన్‌ టీవీ’ మతతత్వ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని, దానిని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ‘కార్యక్రమ నియమ నిబంధనలను పాటించాలని  కేంద్ర సమాచార ప్రసార శాఖ సుదర్శన్‌ టీవీని ఆదేశించి అక్కడితో వదిలేసింద’ని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.   ‘ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీ ఉందని, ఆ కమిటీ కూడా రూ.లక్ష వరకు మాత్రమే జరిమానా విధించగలదని, అదీ సభ్యత్వం ఉన్నవారికే అని ఎన్‌బీఏ చెబుతోంది’ అని ధర్మాసనం మండిపడింది. ఎన్‌బీఏ సభ్యత్వం లేని చానెళ్లపైనా నియంత్రణ ఉండేలా రాజ్యాంగ అధికరణ 142 ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా