2030 నాటికి ప్రపంచ డ్రోన్‌ హబ్‌గా భారత్‌

17 Sep, 2021 03:38 IST|Sakshi

రాబోయే మూడేళ్ళలో రూ.5 వేల కోట్ల పెట్టుబడి అంచనా

డ్రోన్‌ పాలసీ వచి్చన 21 రోజుల్లోనే పీఎల్‌ఐ ప్రకటన

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: 2026 నాటికి డ్రోన్‌ పరిశ్రమ వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆటో, డ్రోన్‌ రంగాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమ్‌పై సింధియా గురువారం మాట్లాడారు. డ్రోన్‌లను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశంగా భారతదేశం ఉండాలని తాము కోరుకుంటున్నామని వివరించారు. 2030 నాటికి భారత్‌ ప్రపంచ డ్రోన్‌ హబ్‌గా మారుతుందనే ధీమాను వ్యక్తం చేశారు.

డ్రోన్‌ల తయారీ రంగానికి రాబోయే మూడేళ్లలో సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. పీఎల్‌ఐ కారణంగా డ్రోన్‌ తయారీ రంగంలో ప్రత్యక్షంగా దాదాపు 10,000 మందికి, పరోక్షంగా డ్రోన్‌ సంబంధిత అన్ని రంగాల్లో కలిపి సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు డ్రోన్‌ రంగానికి చేయూతనిచ్చే ఈ నిర్ణయ పరోక్ష ప్రభావం దేశంలో డ్రోన్‌ సేవలపై కూడా ఉంటుందని సింధియా అన్నారు. దీంతో రాబోయే మూడేళ్లలో మొత్తం డ్రోన్‌ సేవల టర్నోవర్‌ దాదాపు రూ.3 0వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని  తెలిపారు.

ప్రోత్సాహక పథకం కవరేజీని విస్తృతం చేసేందుకు.. డ్రోన్‌ సంబంధిత ఐటి ఉత్పత్తుల డెవలపర్‌లను చేర్చడానికి ప్రభుత్వం అంగీకరించిందని కేంద్రమంత్రి వివరించారు. అంతేగాక ఎస్‌ఎస్‌ఎంఈ, స్టార్టప్‌లు పీఎల్‌ఐ పథకంలో భాగం అయ్యేందుకు డ్రోన్‌ల తయారీదారులకు రూ.2 కోట్లు, డ్రోన్ల విడిభాగాలు తయారుచేసే సంస్థలకు రూ. 50 లక్షలుగా వాటి వార్షిక టర్నోవర్‌ను అర్హతగా నిర్ధారించారు. దీనివల్ల లబి్ధదారుల సంఖ్య పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పీఎల్‌ఐ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలలో రూ.120 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వబోతున్నామని తెలిపారు.  వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, ఎమర్జెన్సీ రెస్పాన్స్, రవాణా, జియో మ్యాపింగ్, రక్షణ వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం జరుగుతున్నందున ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు డ్రోన్లు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని సింధియా వ్యాఖ్యానించారు.

డ్రోన్ల వినియోగం కారణంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకృత డ్రోన్‌ పాలసీని ప్రకటించిందని, ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగానే డ్రోన్‌ రంగానికి కేంద్రప్రభుత్వం 21 రోజుల్లోనే పీఎల్‌ఐను ప్రకటించిందని సింధియా వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్రోన్‌ రంగానికి భారత్‌ నేతృత్వం వహించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఆవిష్కరణ, సమాచార సాంకేతికత, ఇంజనీరింగ్, భారీ దేశీయ డిమాండ్‌ కారణంగా 2030 నాటికి భారతదేశం ప్రపంచ డ్రోన్‌ హబ్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు