గుర్తింపులేని పార్టీలపై ఐటీ కన్ను.. దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో దాడులు

8 Sep, 2022 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: రిజిస్టర్‌ అయినా గుర్తింపులేని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఆదాయ పన్ను శాఖ మూకుమ్మడి దాడులు జరిపింది. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. చట్టవ్యతిరేక మార్గాల్లో పొందిన నిధుల గురించీ దర్యాప్తు కొనసాగుతోంది. నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీలు పన్ను ఎగివేతకు పాల్పడ్డాయని, వాటి చట్టవ్యతిరేక ఆర్థిక లావాదేవీల గుట్టుమట్లు తేల్చేందుకు కేసులు నమోదుచేసి ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.

సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌(సీపీఆర్‌), ఎక్స్‌ఫామ్‌ ఇండియా, ఒక మీడియా ఫౌండేషన్‌ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. విదేశీ నిధుల(నియంత్రణ)చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై దాడులు చేశారు. రాజకీయ పార్టీల సారథులు, పార్టీలతో సంబంధమున్న సంస్థల ఆదాయ వనరులు, వ్యయాలపై అధికారులు ఆరాతీస్తున్నారు. నేరుగా తనిఖీచేసినపుడు ఆయా పార్టీలు మనుగడలో లేవని తేలడంతో 198 పార్టీలను ఈసీ ఇటీవల ఆర్‌యూపీపీ జాబితా నుంచి పక్కన పెట్టి ఐటీ శాఖకు సమాచారమిచ్చింది. నగదు విరాళాలు, కార్యాలయాల చిరునామాల అప్‌గ్రేడ్, పదాధికారుల జాబితా ఇవ్వడం, పారదర్శకత పాటించడంలో విఫలమైన 2,100 పార్టీలపై ఈసీ చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు