వీకెండ్‌ ఎంజాయ్‌..దేశంలో పెరిగిన పర్యటనలు

20 Aug, 2022 08:57 IST|Sakshi

రానున్న 12 నెలల్లో 86 శాతం మంది టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

78% మంది ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమే పర్యటనలకు...

ఆసియన్‌ పసిఫిక్‌ ట్రావెల్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో వారాంతపు పర్యాటకం విస్తరిస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు నెలల ముందుగానే వారాంతపు సెలవులను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సుమారు 86 శాతం మంది భారతీయులు రానున్న 12 నెలల్లో కచ్ఛితంగా ఏదో ఒక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆసియన్‌ పసిఫిక్‌ ట్రావెల్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించింది. ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు 78 శాతం మంది ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. 

పర్యాటక పండుగ సీజన్‌ మొదలు.. 
ఈ నెలలో వారాంతపు సెలవులు ఎక్కువగా రావడంతో పర్యాటక పండుగ సీజన్‌ ప్రారంభమైందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ నెల నుంచే వీకెండ్‌ ప్రయాణాలు ఊపందుకున్నాయి. దీంతో ట్రావెల్‌ బుకింగ్‌ సంస్థలు గెట్‌ అవే డీల్స్‌ను అందిస్తున్నాయి. తదుపరి ట్రిప్‌లో దాదాపు 10 శాతం పైనే రాయితీలను ప్రకటిస్తున్నాయి. మరోవైపు వారాంతపు సెలవుల్లో హోటళ్లు, రిసార్టులు దాదాపు నిండిపోవడంతో పర్యాటకులు హాస్టళ్లు, హోం స్టేలను ప్రత్యామ్నాయంగా తమ జాబితాలో చేర్చుకుంటున్నారు.  

ప్రదేశాల ఎంపికకు ప్రాధాన్యం..
పర్యాటకులు గమ్యస్థానాల ఎంపికకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు మహారాష్ట్రలోని లోనావాలా, పూణే, కొచ్చి ప్రాంతాలను విశ్రాంత విడిది కేంద్రాలుగా ఇష్టపడుతున్నారు. తిరుపతి, షిర్డీ, రిషికేశ్, వారణాసికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని పరిచయం చేసుకునేలా జయపూర్, ఉదయపూర్, ఆగ్రా చుట్టి వస్తున్నారు. పుదుచ్చేరి, గోవా బీచ్‌లు, ఊటీ, మున్నార్, కొడైకెనాల్‌ వంటి హిల్‌స్టేషన్లు పాశ్చాత్య అనుభావాలను అందిస్తుండటంతో యువత ఎక్కువగా అటువైపు క్యూ కడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ పర్యటనల్లో భారతీయ ప్రయాణికులు ఎక్కువగా యూకే, యూఎస్‌ఏ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, మలేషియాతో పాటు తక్కువ సమయంలో వెళ్లి వచ్చేలా థాయ్‌లాండ్, ఇండోనేషియా, టర్కీ, వియత్నాం, యూఏఈలను ఎంపిక చేసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు