పెరుగుతున్న రేప్‌లు, తగ్గుతున్న శిక్షలు

4 Oct, 2020 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ అనంతరం దేశంలో ఎన్నో కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అత్యాచార‌ ఘటనలు తగ్గక పోవడం, పైగా అటువంటి కేసుల్లో శిక్షలు తగ్గి పోవడం శోచనీయం. మహిళల భద్రత కోసం ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలిగించక పోవడం బాధాకరం. ఇందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, దర్యాప్తు సంస్థలకు చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. 2019, డిసెంబర్‌ నెల నాటికి ‘నిర్భయ నిధి’లో కేవలం 9 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి.

2018 ఏడాదితో పోలిస్తే 2019 సంవత్సరానికి మహిళలపై అత్యాచారాలు ఏడు శాతం పెరగ్గా, రేప్‌ కేసుల్లో శిక్షలు 27.8 శాతానికి పడిపోయాయి. 2018లో నమోదైన అత్యాచార కేసుల్లో 15 శాతం కేసుల్లో నేరారోపణలే ఖరారు కాలేదు. దేశంలో అకృత్యాలు నియంత్రించడంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన కఠిన చట్టాల ప్రకారం పోలీసులు, వైద్యులు, న్యాయస్థానం పాత్ర, బాధ్యతలు పెరిగాయి. ఈ మూడు వ్యవస్థలు చిత్తశుద్ధితో పని చేసినట్లయితేనే దేశంలో మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయి. కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అయితే దేశంలో ఎక్కడా ప్రైవేటు ఆస్పత్రులు అత్యాచార‌ బాధితులను చేర్చుకోవడం లేదు. 

మరిన్ని వార్తలు