ప్రపంచపు అత్యంత భారీ కార్పెట్‌ ఇదే...

27 Nov, 2022 20:07 IST|Sakshi

World Largest Carpet ప్రపంచంలోనే అతిపెద్ద కార్పెట్‌ మన దేశంలో రూపుదిద్దుకుంది.  కార్పెట్‌ సిటీగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో పటోడియా కాంట్రాక్ట్‌ అనే సంస్థ ఈ భారీ కార్పెట్‌ను సాకారం చేసింది.  మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు అయిన కజకిస్తాన్‌లోని  నుర్‌–సుల్తాన్‌ మసీదు కోసం   ఈ ప్రాజెక్ట్‌ చేపట్టి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌ను అందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

విశేషాలివే...
మొత్తంగా 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో  ఈ  కార్పెట్‌ను తీర్చిదిద్దారు.  ఈ కార్పెట్‌లో మెడాలియన్‌ 70 మీటర్ల వ్యాసార్థంతో ఉండగా, 80 టన్నుల నిఖార్పైన న్యూజిలాండ్‌ ఊల్‌ స్పన్‌ వినియోగించారు.  దీనిని వెయ్యి మందికి పైగా కార్మికులు ఆరు నెలల పాటు నిర్విరామంగా శ్రమించి తీర్చిదిద్దారు.  ఈ కార్పెట్‌లో ప్రధానంగా రెండు డిజైన్‌లు ఉంటాయి. మసీదులో కోర్ట్‌యార్డ్‌ సెంటర్‌పీస్‌గా వృత్తం, దానిచుట్టూ 8 గొడ్డళ్లు ఉంటే,  జన్నత్‌ ఉల్‌ ఫిరదౌస్‌ స్ఫూర్తితో ఇంకో డిజైన్‌ ఉంటుంది.

అతిపెద్ద కార్పెట్‌ కళ...
ప్రపంచంలో ఇంతవరకూ ఎప్పుడూ ఇంతటి భారీ స్ధాయిలో హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దిన సందర్భం లేదు. ఈ కార్పెట్‌కు సంబంధించి యార్న్‌ స్పిన్నింగ్‌ మొదలు, సైట్‌లో దాని ఇన్‌స్టాలేషన్‌ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్‌  నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం చేసిన ఈ కార్పెట్‌ రూపకల్పనలో అనేక జాగ్రత్తలను  తీసుకుంది. మసీదు నిర్మాణానికి సంబంధించి ప్రతి సూక్ష్మ అంశమూ అంటే ముఖ్యమైన చాండ్లియర్, కార్నర్స్, ఫ్లోరింగ్, కన్వర్జింగ్‌ వాల్స్, పిల్లర్లు వంటివి  పరిగణలోకి తీసుకుని కార్పెట్‌ తీర్చిదిద్దారు.  పటోడియా కాంట్రాక్ట్‌  కంపెనీ 1881 నుంచి కార్పెట్‌ తయారీ రంగంలో ఉంది.  ప్రపంచంలో అగ్రగామి కార్పెట్‌ డిజైనర్లతో కలిసి పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు