‘భరత మాత’ విముక్తికై పోరాడిన ధీర వనితలు

15 Aug, 2020 08:46 IST|Sakshi

భారతావని నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఎర్రకోటపై మువ్వన్నల జెండా రెపరెపలు చూసి భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. మరి ఈనాటి ఈ సంతోషం ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగఫలమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటీష్ అధికారుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు ఎదురొడ్డి, వారు చేసిన అలుపెరుగని పోరాటం కారణంగానే నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాం. ఇక సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది మహిళామణులు కూడా విశేష పాత్ర పోషించారు. ‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించడానికి తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది ధీరోధాత్తలను నేడు స్మరించుకుందాం. ఆ ఆదిశక్తి స్వరూపాలను తలచుకుంటూ జై భరతనారీ అని నినదిద్దాం.

ఝాన్సీ లక్ష్మీబాయి(1828-58)
భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత, ‘ఝాన్సీ’కి రాణి మణికర్ణిక తాంబే. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి.(చదవండి: స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?)

బేగం హజ్రత్‌ మహల్‌(1820-1879)
అవధ్‌ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్‌ మహల్‌ భర్త నవాబ్‌ వాజిద్‌ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్‌ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్‌ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్‌ మార్క్స్‌, తన పుస్తకంలో పేర్కొన్నారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ)

మేడమ్‌ బికాజీ కామా(1861-1936)
పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్‌ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్‌ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్‌ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్‌ హోమ్‌రూల్‌ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర‍్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు.(దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది)

కస్తూర్బా గాంధీ(1869-1944)
భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు.

కమలా నెహ్రూ(1899-1936)
జవహర్‌లాల్‌ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

అనీబిసెంట్‌(1857-1933)
భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్‌ తిలక్‌తో కలిసి ‘హోం రూల్‌’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ.

సరోజిని నాయుడు(1879-1949)
భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు  గవర్నర్‌ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్‌ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్‌’ పతకంతో సత్కరించింది.

విజయ లక్ష్మీ పండిట్‌(1900-1990)
సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్‌ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ సోదరి. కేబినెట్‌ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్‌ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్‌, లండన్‌ మహిళా రాయబారిగా పనిచేశారు.

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌  (1909-1981)
తెలుగు వనిత దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్ర‍ఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

సుచేతా కృపలానీ(1908-1974)
స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా  ముఖ్యమంత్రిగా(ఉత్తర్‌ ప్రదేశ్‌) చరిత్ర సృష్టించారు.

అరుణా అసఫ్‌ అలీ(1909-1996)
భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్‌ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు