స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

12 Aug, 2020 20:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ప్రస్తుతం దేశంలో ఏ వేడుకలు జరిగే పరిస్థితి లేదు. అయితే ఏది ఎలా ఉన్నా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం మాత్రం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అధికారులు వేడుక నిర్వహణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రోజు విధులు నిర్వహించే భద్రతా అధికారులు ఆగస్టు 15 ఉదయం వరకు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అంతేకాక జెండా ఎగరవేసే సమయంలో ప్రధానికి సమీపంగా ఉండే వారికి కరోనా టెస్టులు చేయిస్తున్నారు అధికారులు. ఆగస్టు 15న ఎర్రకోటలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సమీపంగా ఓ మహిళా సైనిక అధికారి ఉండనున్నారు. సదరు అధికారిణి జెండా తాడును మోదీకి అందిస్తారు. ఆ తర్వాత ప్రధాని జెండాను ఎగువేస్తారు. ఈ క్రమంలో తాడు ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మహిళా అధికారికి కోవిడ్‌-19 పరీక్ష చేయించారు అధికారులు. (కరోనా.. పాఠం నేర్వాలి)

ఆగస్టు 15 వేడుకల్లో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది అందరికి కరోనా టెస్టులు చేయించారు అధికారులు. ఎర్రకోటలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొందరు వీవీఐపీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారు. దాంతో వారి క్షేమం దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిలో భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం, ఢిల్లీ పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్లు, ఆపరేటర్లు, కుక్‌, ట్రైనర్స్‌, ఇతర సిబ్బంది కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు