India: ఆహార భద్రత అంతంత మాత్రమే 

20 Oct, 2021 08:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌లో ప్రజలకు ఆహార భద్రత అంతంత మాత్రమేనన్న విషయం మరోసారి రూఢీ అయింది. ప్రపంచ ఆహార భద్రతా సూచీ(జీఎఫ్‌ఎస్‌)లో భారత్‌ 71వ స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన ఎకనమిస్ట్‌ ఇంపాక్ట్‌ సంస్థ కోర్టెవా అగ్రిసైన్స్‌ సాయంతో తయారు చేసిన 113 దేశాలతో కూడిన వార్షిక నివేదిక జీఎఫ్‌ఎస్‌ ఇండెక్స్‌–2021ను మంగళవారం విడుదల చేసింది. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజవనరులు వంటి అంశాల ఆధారంగా 113  దేశాల్లో ఆహార భద్రతను అంచనా వేసింది.

అంతేకాకుండా ఆహార భద్రతకు సంబంధించి ఆర్థిక అసమానతల వంటి 58 అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఇండెక్స్‌లో 71వ స్థానంలో ఉన్న భారత్‌కు మొత్తమ్మీద 57.2 పాయింట్లు దక్కాయి. ఈ విషయంలో భారత పొరుగుదేశాలైన పాకిస్తాన్‌ 52.6 పాయింట్లతో 75వ స్థానంలో, శ్రీలంక 62.9 పాయింట్లతో 77వ స్థానంలో, నేపాల్‌ 79, బంగ్లాదేశ్‌ 84వ స్థానంలో ఉన్నాయి. చైనా 34వ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ సూచీలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా మొత్తమ్మీద 77.8–80 మధ్య మార్కులతో టాప్‌ ర్యాంకులను దక్కించుకున్నాయి.

ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, ఆహారోత్పత్తిలో సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్‌ మెరుగైన స్థానంలో ఉందని వార్షిక నివేదిక తెలిపింది. ఆహార భద్రత విషయంలో గత పదేళ్లుగా భారత్‌ సాధించిన అభివృద్ధి పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కంటే వెనుకంజలోనే ఉందని తెలిపింది. 2012లో భారత స్కోర్‌ 54.5 కాగా కేవలం 2.7 పాయింట్లు పెరిగి 2021కి 57.2 పాయింట్లకు చేరుకుంది.

పాకిస్తాన్‌ స్కోర్‌ 45.7 నుంచి 54.7కు, నేపాల్‌ స్కోర్‌ 46.7 నుంచి 53.7కు, బంగ్లాదేశ్‌ స్కోరు 44.4 నుంచి 49.1కి పెరగ్గా, చైనా స్కోరు 61.7 నుంచి 71.3కు చేరుకుందని తెలిపింది. సరసమైన ధరలకు ఆహారం లభించే దేశాల్లో భారత్‌ కంటే పాకిస్తాన్, శ్రీలంక మెరుగైన స్థానాల్లో ఉండటం విశేషం. జీఎఫ్‌ఎస్‌ ఇండెక్స్‌ హెడ్‌ ప్రతిమా సింగ్‌ మాట్లాడుతూ.. ‘గత పదేళ్లుగా ఆహార భద్రత లక్ష్య సాధన దిశగా గణనీయ పురోగతి సాధించినప్పటికీ, ఆహార వ్యవస్థలు ఇప్పటికీ ఆర్థిక, వాతావరణ, భౌగోళిక రాజకీయ పరిణామాలకు లోనవుతూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు, ఆకలి, పోషకాహార లోపం నివారించి, అందరికీ ఆహారభద్రతను సమకూర్చేందుకు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చర్యలు అత్యవసరం’అని పేర్కొన్నారు.   

చదవండి: కెప్టెన్‌ సొంత పార్టీ! 

మరిన్ని వార్తలు