ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయం

15 Aug, 2021 02:22 IST|Sakshi
జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌

కరోనాపై అస్త్ర సన్యాసం చేయొద్దు

రెండో వేవ్‌ నుంచి భారత్‌ ఇంకా బయటపడలేదు

ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి

ఆడబిడ్డలకు జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కల్పించాల

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం

న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్‌ ఒక దేవాలయం. ప్రజల సంక్షేమం కోసం చర్చలు, సంవాదాలు జరిగే, నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వేదిక’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. నిరంతర అంతరాయాలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొనడం, పాలక– ప్రతిపక్షాలు పట్టుదలకు పోవడంతో షెడ్యూల్‌కంటే రెండురోజుల ముందే సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రథమపౌరుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్న విశిష్టతపై మాట్లాడటం గమనార్హం.

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కోవింద్‌ టీవీలో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. కోవిడ్‌–19 రెండో వేవ్‌ సృష్టించిన విలయం నుంచి దేశం ఇంకా బయటపడలేదని చెప్పారు. మహమ్మారి విషయంలో ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఇంకా ఏం మాట్లాడారంటే..

► మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం.
► కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.
► వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణలు మన అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తాయి. వారు తమ పంట ఉత్పత్తులకు మరింత మేలైన ధర పొందడానికి ఈ సంస్కరణలు ఉపకరిస్తాయి.
► కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించింది.
► వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కృషి వల్ల కరోనా సెకండ్‌ వేవ్‌పై పైచేయి సాధించగలిగాం.
► కరోనా ప్రతికూల కాలంలో కూడా వ్యవసాయ రంగంలో పురోగతి సాధించాం. మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వ్యాపారులు, వలస కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.
► కరోనా వ్యాప్తి వల్ల నష్టపోయిన రంగాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తిరిగి కోలుకునేందుకు తగిన సాయం అందిస్తోంది.
► కోవిడ్‌–19 నియంత్రణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 50 కోట్లకు పైగా టీకా డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లే రక్షణ కవచం. కరోనా తీవ్రత కొంత తగ్గినప్పటికీ వైరస్‌ ఇంకా పూర్తిగా పోలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి.
► భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని చాలామంది అనుమానించారు. ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
► పురాతన కాలంలోనే భారత గడ్డపై ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయి. ఆధునిక యుగంలోనూ ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నో పశ్చి మ దేశాల కంటే భారత్‌ ముందంజలో ఉంది.
► సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
► మన పార్లమెంట్‌ త్వరలో కొత్త భవనంలోకి మారబోతోంది. ఇది భారతీయులందరికీ గర్వకారణం.
► మీ కుమార్తెలకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు కల్పించండి అని తల్లిదండ్రులను కోరుతున్నా.
► ఉన్నత విద్యా సంస్థల నుంచి సైనిక దళాల దాకా.. ప్రయోగశాల నుంచి క్రీడా మైదానాల దాకా ప్రతిచోటా ఆడబిడ్డలు వారిదైన ముద్ర వేస్తున్నారు.
► ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో మన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వారికి అభినందనలు. 121 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన దేశం ఈసారి గతంలో కంటే అధికంగా పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయం.
► భారత క్రీడాకారిణులు ఎన్నో అవరోధాలను అధిగమించి ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపారు.
► మన ఆడబిడ్డల ప్రతిభా పాటవాలు, వారు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి చెందిన భారత్‌ను ఇప్పుడే దర్శించగలుగుతున్నా. అగ్రస్థానానికి ఎదిగిన ఆడపిల్లల కుటుంబాల నుంచి నేర్చుకోవాలని, వారికి అవకాశాలు కల్పించేందుకు తోడ్పడాలని తల్లిదండ్రులకు నా సూచన.
►  జమ్మూకశ్మీర్‌లో కొత్త పొద్దు పొడిచింది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కలలను నిజం చేసుకొనేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో కృషి చేయాలి.
► ఆధునిక పారిశ్రామిక విప్లవం మానవళికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. వాతావరణ మార్పులు పెనుశాపంగా మారుతున్నాయి.
► మంచు కరిగిపోయి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పారిస్‌ వాతావణ ఒప్పందానికి భారత్‌ కట్టుబడి ఉంది. అంతేకాదు వాతావరణ పరిరక్షణకు భారత్‌ చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేస్తోంది. ఈ విషయంలో మిగతా ప్రపంచ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.  
► ను ఇటీవల బారాముల్లాలో డాగర్‌ వార్‌ మెమోరియల్‌ను సందర్శించా. అక్కడ ‘నేను చేసే ప్రతి పని దేశం కోసమే’అని రాసి ఉంది. ఇదే మన నినాదం కావాలి. దేశ ప్రగతి కోసం పూర్తి అంకితభావంతో పని చేయాలి. భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి మనమంతా ఒక్క తాటిపైకి రావాలి.

మరిన్ని వార్తలు