నిర్దిష్ట చర్చ లేకుండా చట్టాలా!?

16 Aug, 2021 03:58 IST|Sakshi
జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ  

చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు  

విస్తృతమైన చర్చ జరిగితే చట్టాల ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను రూపొందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. పార్లమెంట్‌లో నిర్దిష్ట చర్చ జరగకుండానే చట్టాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వాటిలో స్పష్టత లేకుండా పోతోందని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌  ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై, అవి ప్రజలపై చూపించే ప్రభావంపై గతంలో పార్లమెంట్‌లో ఎన్నో చర్చలు, సంవాదాలు జరిగేవని గుర్తుచేశారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ పరిజ్ఞానం కలిగిన వారు చట్టసభలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పార్లమెంట్‌లో చట్టాలను రూపొందించే సమయంలో విస్తృతమైన చర్చ జరిగితే కోర్టులు వాటి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాయని, తద్వారా న్యాయ వివాదాలు తగ్గుతాయని సూచించారు.

తొలి పార్లమెంట్‌లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మహత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్‌ తదితర నేతలు న్యాయవాదులే. న్యాయవాదులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందించాలి’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు.  ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు