కరోనా: ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో కేసులు.. పరిస్థితి ఆందోళ

3 Apr, 2021 11:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ గడగడలాడిస్తోంది. గత ఆరు నెలల క్రితం ఎన్ని కేసులు వచ్చేవో.. అన్ని కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా.. మరోవైపు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి ఎగబాకింది. దేశంలో శుక్రవారం 89,129 కరోనా కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో 69,986.. బ్రెజిల్‌లో 69,662 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. 

కాగా గత సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,92,260 దాటింది. ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 1,64,1110 మంది మృత్యువాతపడగా.. ప్రస్తుతం 6,58,909 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.36%, మరణాల రేటు 1.32%గా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. రోజురోజుకీ దేశంలో కరోనా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. 

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ 7 కోట్ల మైలురాయిని దాటింది. నిన్న(శుక్రవారం) ఒక్క రోజే 12.76 లక్షల డోసుల పంపిణీ చేసింది. ఇప్పటివరకు 7,06,18,026 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 6,13,56,345 మంది తొలి డోసు వేసుకోవగా..92,61,681 మందికి రెండో డోసు అందించారు. 45 ఏళ్లు పైబడిన 4,29,37,126 మందికి తొలి డోసు ఇచ్చారు.

చదవండి: మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదేమో..
వాంఖడేలో కరోనా కలకలం.. బీసీసీఐ పునరాలోచన

మరిన్ని వార్తలు