దేశంలో తగ్గిన నవజాత శిశు మరణాలు

24 Sep, 2022 06:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నవజాత శిశు, బాలల మరణాల నివారణలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు నమూనా రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) స్టాటిస్టికల్‌ రిపోర్ట్‌–2020ని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. 2014తో పోలిస్తే శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌), నవజాత శిశు మరణాల రేటు (ఎన్‌ఎంఆర్‌), ఐదేళ్లలోపు వారి మరణాల రేటు(యూఎంఆర్‌)లో బాగా తగ్గాయని తెలిపింది. ‘‘నవజాత శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యిమందికి 22 కాగా, 2020 నాటికి 20కి తగ్గింది.

మరణాల వార్షిక తగ్గుదల రేటు 9.1%. ఇది పట్టణ ప్రాంతాల్లో 12%, గ్రామీణ ప్రాంతాల్లో 23%. ఐదేళ్ల కంటే తక్కువ వయసు బాలల మరణాలు 2019లో ప్రతి వెయ్యికి 35 కాగా 2020కి 32కి తగ్గాయి. వీటిని 2030 నాటికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి’’ అని నివేదిక తెలిపింది. ఈ తరహా మరణాల తగ్గింపులో కేరళ (8), తమిళనాడు (13), ఢిల్లీ (14)ముందు వరుసలో ఉండగా తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 23 మరణాలు ఉన్నాయని వెల్లడించింది. శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యి మందికిు 30 ఉండగా, 2020 నాటికి అది 28కి తగ్గిందని తెలిపింది. 

మరిన్ని వార్తలు