చైనా సరిహద్దులకు మరిన్ని బలగాలు

31 Jul, 2020 04:30 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్‌ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

గల్వాన్‌ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే అవకాశం లేకపోవడం ఇంకో కారణం. భారత్‌ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్‌ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్‌ ప్రాంతంలో పూర్తిగా మారిపోయింది. రెండువైపులా అదనపు బలగాలను మోహరిస్తున్నారు.

అత్యున్నత స్థాయి రాజకీయ నిర్ణయం జరిగితే మినహా ఏ పక్షమూ తన బలగాలను వెనక్కు తీసుకోదు’’అని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ‘ద యునైటెడ్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూషన్‌’డైరెక్టర్‌ విశ్రాంత మేజర్‌ జనరల్‌ బి.కె.శర్మ తెలిపారు. సరిహద్దు సమస్యపై కమాండర్ల స్థాయిలో ఇంకోసారి చర్చలు జరగనున్నాయని, సమస్య పరిష్కారానికి భారత్‌ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ వ్యాఖ్యానించారు.  

సైన్యం ఉపసంహరణ పూర్తి కాలేదు
తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా దళాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదని భారత్‌ గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. దళాల ఉపసంహరణ అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దాదాపు పూర్తయిందని చైనా రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో భారత్‌ ఈ స్పష్టత ఇచ్చింది.

‘బలగాల ఉపసంహరణకు సంబంధించి కొంత పురోగతి ఉంది. కానీ, పూర్తిగా ఉపసంహరణ జరగలేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో శాంతి.. విషయాల్లో చైనా నిజాయతీగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య మరో విడత మిలటరీ కమాండర్‌ స్థాయి చర్చలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

స్మారకంపై గల్వాన్‌ అమరులు
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్‌ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్‌ 15వ తేదీన గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 16 బిహార్‌ రెజిమెంట్‌కి చెందిన కల్నల్‌ బి.సంతోష్‌ బాబుతో పాటు, 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా