కరోనా కాఠిన్యం

24 Apr, 2021 06:21 IST|Sakshi
ఢిల్లీలోని సీతాపురి శ్మశాన వాటికలో కోవిడ్‌ బాధితుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు

భారత్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. మరణాలు

ఒక్క రోజు వ్యవధిలో 3,32,730 కేసులు నమోదు

మరో 2,263 మందిని బలి తీసుకున్న మహమ్మారి

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌–19 మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య శరవేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ రికార్డులను తిరగరాస్తూ దేశంలో వరుసగా రెండో రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 3,32,730 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి.

ఒక్కరోజులో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 75.01 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం.  దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడినవారి సంఖ్య 1,62,63,695కు చేరింది.  దేశంలో 24 గంటల్లో మరో 2,263 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.  ఒక్క రోజులో కరోనా సంబంధిత మరణాల్లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. దీంతో  మొత్తం మరణాల సంఖ్య 1,86,920కు చేరుకుంది. రోజువారీ కరోనా సంబంధిత మరణాల్లో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. 2,027 మరణాలతో బ్రెజిల్‌ రెండో స్థానంలో నిలిచింది.  మహారాష్ట్రలో 568, ఢిల్లీలో 306 మరణాలు సంభవించాయి.

రికవరీ రేటు 83.92 శాతం
భారత్‌లో ప్రస్తుతం 24,28,616 యాక్టివ్‌(క్రియాశీల) కరోనా కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 14.93 శాతం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,93,279 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,36,48,159కు చేరింది. రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 59.12 శాతం కేసులు ఐదు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఉన్నాయి. బెంగళూరులో 1.37 లక్షలు, పుణేలో 1.17 లక్షలు, ఢిల్లీలో 91 వేలు, ముంబైలో 81 వేలు, నాగపూర్‌లో 80,924, థానేలో 80,643, లక్నోలో 54,967, నాసిక్‌లో 46,706, అహ్మదాబాద్‌లో 36,247, చెన్నైలో 30,404 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.15 శాతంగా నమోదయ్యింది.  భారత్‌లో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 13,54,78,420కు చేరుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో సింగిల్‌ డే రికార్డు
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37,238 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 199 మంది బాధితులు మరణించారు. దీంతో యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,13,370కి, మరణాల సంఖ్య 10,737కు చేరుకుంది.  

మరిన్ని వార్తలు