నూతన సంవత్సరంలో నింగికి నిచ్చెనలు

28 Dec, 2021 04:27 IST|Sakshi

కీలక ప్రాజెక్టులపై ఇస్రో కృషి

వినువీధి ప్రయోగాలపై పట్టుకు యత్నం

కొత్త సంవత్సరంలో నింగిని మరింత లోతుగా శోధించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. 2022లో వివిధ అంతరిక్ష  ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి, అగ్రరాజ్యాలకే పరిమితమైన ఘనతను భారత్‌కు కూడా కట్టబెట్టాలని ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) పట్టుదలగా కృషి చేస్తోంది.  గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా సరికొత్త ప్రయోగాలను కూడా చేపడతామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2022ను అంతరిక్ష నామ సంవత్సరంగా మార్చేందుకు ఇస్రో చేపట్టనున్న కీలక ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి...

గగన్‌ యాన్‌
అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను తొలిసారి సొంతంగా పంపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం ముందుగా ఇస్రో మానవ రహిత యాత్రను చేపట్టనుంది. క్రూ ఎస్కేప్‌సిస్టం పనితీరు పరిశీలనకు, గగన్‌ యాన్‌ మానవ రహిత మిషన్‌ కోసం 2022 ద్వితీయార్ధంలో ఇస్రో ఒక టెస్ట్‌ వెహికిల్‌ ఫ్లైట్‌ను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. దీని అనంతరం ఏడాది చివరిలో మరోమారు మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. ఈ రెండు మిషన్లు విజయవంతంగా పూర్తైతే అప్పుడు నింగిలోకి వ్యోమగాములను పంపుతారు.

ఇందుకోసం ముగ్గురు భారతీయ వాయు సేన అధికారులను ఎంచుకొని శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి నలుగురిని ఎంపిక చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. మానవ సహిత గగన్‌ యాన్‌ను 2023లో ఎలాగైనా పూర్తి చేయాలని పనిచేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేందర్‌సింగ్‌ చెప్పారు. లో ఎర్త్‌ ఆర్బిట్‌లోకి దేశీయ లాంచ్‌ వెహికిల్‌ ద్వారా మనుషులను పంపి, తిరిగి దిగ్విజయంగా భూమికి తీసుకురావడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం.  

ఆదిత్య మిషన్‌
సూర్యుడిపై అధ్యయనానికి భారత్‌ తొలిసారి ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆదిత్య ఎల్‌1 మిషన్‌ను చేపట్టింది. 2021లో ఆరంభించాలనుకున్నా, కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌ 1 పాయింట్‌(లాంగ్రేజియన్‌ పాయింట్‌) చుట్టూ ఉండే కక్ష్యలోకి ఈ మిషన్‌ను ప్రవేశపెడతారు. మార్స్‌ ఆర్బిటర్‌ తర్వాత ఇస్రో చేపట్టే రెండో హైప్రొఫైల్‌ స్పేస్‌ మిషన్‌ ఇదే కావడం విశేషం

చంద్రయాన్‌ 3
2008లో ఆరంభించిన చంద్రయాన్‌కు కొనసాగింపుగా 2022 మూడో త్రైమాసికంలో ఇస్రో చంద్రయాన్‌ 3 మిషన్‌ చేపట్టనుంది. చంద్రయాన్‌ విజయవంతమైన తర్వాత చేపట్టిన చంద్రయాన్‌ 2 విఫలమైంది. ప్రయోగించిన లాండర్, రోవర్‌లు చంద్రుడిపై పడిపోయాయి. కానీ ఆర్బిటర్‌ మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. దీన్ని చంద్రయాన్‌ 3లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ
లో ఎర్త్‌ ఆర్బిట్‌ (భూ ఉపరితలం నుంచి 160 కి.మీ. – 2 వేల కి.మీ. ఎత్తు లోపు ఉపగ్రహాలు సంచరించే కక్ష్య)లో ఉప గ్రహాలను ప్రవేశపెట్టే మిషన్ల విషయంలో భారత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇస్రో ఒక స్మాల్‌ సాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ని అభివృద్ది చేస్తోంది. ఈ వెహికిల్‌ను 2022 తొలి త్రైమాసికంలో ప్రయోగిస్తారు.

సుమారు 500 కిలోలను 500 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకుపోయే పేలోడ్‌ సామర్ధ్యం దీని సొంతం. పీఎస్‌ఎల్‌వీతో పోలిస్తే ఇది చిన్న, తేలికపాటి ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి తీసుకుపోగలదు. దీని అభివృద్ధికి కేంద్రం రూ. 169 కోట్లు కేటాయించింది. ఈ వెహికిల్‌ ఒకేమారు పలు నానో, మైక్రో ఉపగ్రహాలను మోయగలదు. 2021–23 కాలంలో నాలుగు దేశాలతో ఉపగ్రహ ప్రయోగాలకు సంబం ధించి ఇస్రో ఆరు ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా సంస్థకు సుమారు 13.2 కోట్ల యూరోల ఆదాయం సమకూరుతుంది. 

– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు