విచ్ఛిన్న శక్తులపై ఉమ్మడి పోరు

7 Sep, 2022 05:00 IST|Sakshi

భారత్‌–బంగ్లాదేశ్‌ ప్రధానుల భేటీలో నిర్ణయం

25 ఏళ్ల తర్వాత నదీ జలాల పంపిణీపై ఒప్పందం

బంగ్లా రైల్వేల అభివృద్ధికి భారత్‌ సాయం

న్యూఢిల్లీ: పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద, ఛాందసవాద శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, బంగ్లాదేశ్‌ నిర్ణయించాయి. భారత్‌ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదం, ఛాందస వాదంపై పోరులో సహకరించుకోవాలని మేం నిర్ణయించాం. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా నిలుపుకునేందుకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాం’ అని అన్నారు.

రెండు దేశాలను కలుపుతూ ప్రవహించే 54 నదులపై ఆధారపడి కోట్లాదిమంది రెండు దేశాల ప్రజలు శతాబ్దాలుగా జీవిస్తున్నారని మోదీ వివరించారు. ‘మైత్రి, సహకారభావం స్ఫూర్తితో రెండు దేశాలు ఎన్నో అంశాలను పరిష్కరించుకున్నాయి. తీస్తా నదీ జలాల పంపిణీ సహా అన్ని ప్రధాన సమస్యలపై త్వరలోనే అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సెపా)పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని వెల్లడించారు. బంగ్లాదేశ్‌పై చైనా పలుకుబడి పెరిగిపోవడంపైనా ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా చెప్పారు.  

ఏడు ఒప్పందాలపై సంతకాలు
మోదీ, హసీనాల చర్చల అనంతరం రెండు దేశాల అధికారులు రైల్వేలు, అంతరిక్ష పరిజ్ఞానం, నదీ జలాల పంపిణీ, అనుసంధానతకు సంబంధించిన 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో కుషియారా నదీ జలాల ఒప్పందం కూడా ఉంది. దీనిద్వారా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, భారత్‌లో దక్షిణ అస్సాం లాభపడతాయి. 1996లో గంగా జలాల ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందం ఇదే.  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలతో 2011 నుంచి తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతుండటంపై హసీనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కుదిరిన ఎంవోయూలు..
బంగ్లాదేశ్‌ రైల్వే ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ, ఐటీ సొల్యూషన్స్‌ భారత్‌ సమకూర్చుతుంది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ రోడ్లు, హైవేల శాఖకు భారత్‌ నిర్మాణ సామగ్రి, యంత్రాలను అందజేయనుంది. ఖుల్నా–దర్శన రైలు మార్గం ప్రాజెక్టులో ట్రాక్‌ డబ్లింగ్‌ పనుల్లోనూ, పర్బతీపూర్‌– కౌనియా రైలు మార్గాన్ని డబుల్‌ లైన్‌గా మార్చేందుకు భారత్‌ సాయం చేయనుంది. ఖుల్నాలోని రాంపాల్‌ వద్ద 1,320 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ బొగ్గు ఆధారిత ప్లాంట్‌ మైత్రి యూనిట్‌–1ను, ఖుల్నా–మోంగ్లా పోర్టు ప్రాజెక్టులోని 5.13 కిలోమీటర్ల రుప్షా రైలు వంతెనను ప్రారంభించారు.  

షేక్‌ హసీనాకు ఘన స్వాగతం
బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా నాలుగు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌ వద్ద ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు సహకారం, పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యం. మైత్రితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని మా విశ్వాసం’అని హసీనా అన్నారు. అనంతరం హసీనా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయ్యారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు.

మరిన్ని వార్తలు