చైనాతో మళ్లీ ఘర్షణ

26 Jan, 2021 02:23 IST|Sakshi

ఉత్తర సిక్కింలోని నాకు లా ప్రాంతంలో ఇరు దేశాల జవాన్ల బాహాబాహీ

న్యూఢిల్లీ: ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య గతవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ బాహాబాహీలో రెండు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సుమారు 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని ఆర్మీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో ఇరుదేశాల మధ్య 9వ విడత చర్చలు ఆదివారం ఉదయం ప్రారంభమై.. సోమవారం మధ్నాహ్నం వరకు కొనసాగాయి.

తాజా ఘటనను భూతద్దంలో చూసి, అనవసర, అబద్ధపు ప్రచారం చేయవద్దని మీడియాను కోరుతున్నామని భారతీయ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ వ్యాఖ్యానించారు. ‘సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయన్నారు.

అహంకార ధోరణి సరికాదు: జిన్‌పింగ్‌
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌)ను ఉద్దేశించి జిన్‌పింగ్‌ సోమవారం ప్రత్యేకంగా ప్రసంగించారు.  వారంపాటు జరిగే ఈ డబ్ల్యూఈఎఫ్‌ ఆన్‌లైన్‌ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం ప్రసంగిస్తారు. సొంత ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇతర దేశాలను ఇబ్బంది పెడ్తూ అహంకార పూరిత ధోరణితో వ్యవహరించే దేశాలు ఒంటరిగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ఏ దేశం పేరునూ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా, భారత్‌లను ఉద్దేశించే జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు