దేశీ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపు

13 Aug, 2020 15:17 IST|Sakshi

క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా కోరిన డబ్ల్యూహెచ్‌ఓ

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచం ఎంతో ఆశగా ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ రష్యాలో నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆర్భాటంగా ప్రకటించినా భారత్‌ సహా మిగతా ప్రపంచం ఈ వ్యాక్సిన్‌ పట్ల ఏమంత ఆసక్తి కనబరచడం లేదు. పుతిన్‌ స్వయంగా తన కుమార్తెకు వ్యాక్సిన్‌ వేశామని చెప్పినా ప్రపంచంలో తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలు ఆశించిన స్ధాయిలో ఉత్సు కత ప్రదర్శించలేదు. ప్రస్తుతం ఇతర దేశాల కంటే అధికంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో వైరస్‌ కేసులు వెలుగుచూస్తున్న భారత్‌లోనూ రష్యా వ్యాక్సిన్‌ పట్ల ఉత్సుకత కనిపించలేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల మాస్కో పర్యటన నేపథ్యంలో భారత్‌కు వ్యాక్సిన్‌ సరఫరాలకు ఆ దేశం సానుకూలత చూపుతుందని తెలిసినా ఆ దిశగా ఎలాంటి కసరత్తు సాగుతున్న సంకేతాలు లేవు.

తమ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కొనే నిరోధకతను కలిగిఉందని, ఈ వ్యాక్సిన్‌ అన్ని బయో సేఫ్టీ పరీక్షలను అధిగమించిందని వ్యాక్సిన్‌ను లాంఛ్‌ చేస్తూ పుతిన్‌ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఎనిమిది వారాల్లో పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. తమకు 20 దేశాల నుంచి వ్యాక్సిన్‌కోసం ముందస్తు ఆర్డర్లు వచ్చాయని రష్యా వెల్లడించింది. అయితే ఆయా దేశాలు ఆర్డర్లు ఇచ్చాయా లేక ఇతర వ్యాక్సిన్‌లు వచ్చేవరకూ వేచిచూసే ధోరణిలో ఉన్నాయా అనేదానిపై స్పష్టత లేదు.


డబ్ల్యూహెచ్‌ఓ సందిగ్ధం
క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాకుండానే రష్యా వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నారని ముందునుంచీ చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ వ్యాక్సిన్‌ కోవిడ్‌-19ను సమర్ధంగా నివారిస్తుందా అనేదానిపై నిర్ధిష్టం సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది. వ్యాక్సిన్‌ పరీక్షల సమాచారాన్ని విడుదల చేయాలని నిపుణులు పరీక్షించేందుకు ఈ డేటా అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే రష్యాను కోరింది. రష్యా తన కరోనా వ్యాక్సిన్‌ స్పుట్నిక్‌ వీ తొలి దశ పరీక్షలను జూన్‌ ద్వితీయార్ధంలో చేపట్టగా, చైనా, అమెరికాలు అప్పటికే తొలి దశ పరీక్షల తుది దశలో ఉన్నాయి.

రష్యా ఆలస్యంగా వ్యాక్సిన్‌ పరీక్షలను ప్రారంభించినా తుది దశ పరీక్షలు పూర్తికాకుండానే రష్యా అధ్యక్షుడు తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. వ్యాక్సిన్‌ పరీక్షలకు తమ మార్గదర్శకాలు అనుసరించాలని, అన్ని దశల డేటాను విడుదల చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ రష్యాను కోరినా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ డేటాను వెల్లడించలేదు.


భద్రతే కీలకం
భారత్‌తో సహా పలు దేశాల్లో తమ వ్యాక్సిన్‌ తయారీని చేపట్టేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తోందని గమలేయా ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అయితే రష్యా వ్యాక్సిన్‌పై ఆచితూచి వ్యవహరించాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ అన్నారు. ఈ వ్యాక్సిన్‌ భద్రతను, సామర్ధ్యాన్ని నిర్ధారించాలన్నారు. ఈ వ్యాక్సిన్‌ ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కలిగించకపోవడంతో పాటు వ్యాధినిరోధకతను, వ్యాధుల నుంచి రక్షణను కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. రష్యా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో పాటు రష్యాలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ డ్రగ్‌ తయారీ కంపెనీల సమాఖ్య (యాక్టో) సైతం వ్యాక్సిన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మూడవ దశ పరీక్షల డేటా విడుదలై ఈ వ్యాక్సిన్‌ వైరస్‌ను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తుల భద్రతను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ వ్యాక్సిన్‌ నమోదు చేపట్టాలని యాక్టో ప్రభుత్వాన్ని కోరింది.


ప్రత్యామ్నాయాల కోసం నిరీక్షణ
రష్యా కరోనా వ్యాక్సిన్‌ స్పుట్నిక్‌ వీకు ప్రత్యామ్నాయంగా మరో రెండు దీటైన వ్యాక్సిన్‌లు కీలక దశలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేఈత్తలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు మోడెర్నా వ్యాక్సిన్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడవ దశ పరీక్షల దశలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ను 10,000 మందిపై ప్రయోగించనున్నారు.తొలి దశలో 1000 మందిపై వ్యాక్సిన్‌ డోసులను ప్రయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారుచేసేందుకు పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక భారత్‌లో భారత్‌ బయోటెక్‌ కోవాక్జిన్‌ పేరుతో దేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. తొలి దశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడికావడంతో ఒకేసారి రెండు, మూడవ దశ పరీక్షలను చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే మానవ పరీక్షల దశను పూర్తిచేసి రెగ్యులేటరీ అనుమతులతో కోవాక్జిన్‌ అందుబాటులోకి రానుంది. వాటర్‌ బాటిల్‌ కంటే తక్కువ ధరలోనే ఈ వ్యాక్సిన్‌ లభిస్తుందని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.

చదవండి : వైరస్‌ గుట్టు తెలిసింది

మరిన్ని వార్తలు