వ్యాక్సిన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన

12 Nov, 2020 15:52 IST|Sakshi

రూ.2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపన ప్యాకేజీ

వ్యాక్సిన్‌ అభివృద్ధికోసం రూ.900 కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ టీకా కోసం దేశమంతా ఎదురు చేస్తున్న వేళ కేంద్ర  ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్‌-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం  900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి  ప్రకటించారు. మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె గురువారం వెల్లడించారు. (భారత్‌ చేరుకున్న రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్)

వ్యాక్సిన్ పరిశోధన,  అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కోవిడ్‌ సురక్షా మిషన్‌ పేరుతో  ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి  ఈ నిధులను అందించినట్టు చెప్పారు. రూ .2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపనలో ఇవి భాగమని తెలిపారు. కాగా ఇప్పటికే భారతదేశంలో పలు వ్యాక్సిన్ ట్రయల్స్  దశల్లో ఉన్నాయి. ఈ పరిశోధనల పురోగతిని అంచనా వేయడానికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  సమీక్షా సమావేశాన్ని కూడా ఇటీవల నిర్వహించారు.  ఈ రివ్యూ మీటింగ్‌లో ఆరోగ్యమంత్రి హర్ష్ వర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు,  సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ పరిశోధన,  అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నదన్న అంచనాల అనంతరం ఈ నిధుల ప్రకటన రావడం విశేషం. మరోవైపు టీకా ఉత్పత్తిలో భారతదేశం పాత్రను డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రశంసించిన సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

మరిన్ని వార్తలు