Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు

20 May, 2021 05:38 IST|Sakshi

కొత్త యాంటిజెన్‌ కిట్‌కు అనుమతిచ్చిన ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవడానికి వీలుగా కొత్త ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ (ర్యాట్‌) కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) బుధవారం అనుమతి ఇచ్చింది. లక్షణాలు ఉన్నవారు, ల్యాబ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహితంగా మెలిగివారు మాత్రమే దీన్ని ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసుకోవాలని సూచించింది. పుణేకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందిన ఈ కిట్‌ను పరీక్షించి అనుమతించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ముక్కులో నుంచి తీసిన స్వాబ్‌తో పరీక్ష ఉంటుందని, ఉత్పత్తిదారు యూజర్‌ మాన్యూవల్‌లో సూచించిన ప్రకారం పరీక్ష చేసుకోవచ్చని తెలిపింది. విచ్చలవిడిగా దీనితో ఇంట్లో పరీక్షలు నిర్వహించకూడదని హెచ్చరించింది.

ఈ కొత్త యాంజిజెన్‌ కిట్‌తో ఇంట్లో చేసిన పరీక్షలో పాజిటివ్‌గా తేలితే.. వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని పేర్కొంది. వారికి మళ్లీ టెస్టులు అవసరం లేదని పేర్కొంది. లక్షణాలు ఉండీ ఒకవేళ నెగిటివ్‌గా వస్తే మాత్రం... అలాంటి వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని కోరింది. వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉంటే.. కొన్నిసార్లు యాంటిజెన్‌ పరీక్షల్లో దొరక్కపోవచ్చని వివరించింది. యాంటిజెన్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చినా... లక్షణాలుంటే వారిని కోవిడ్‌ బాధితులుగా పరిగణించి చికిత్స అందించాలని... ఆర్‌టీపీసీఆర్‌ ఫలితం వచ్చేదాకా వీరి విషయంలో ఆరోగ్యశాఖ ఇచ్చిన హోం ఐసోలేషన్‌ ప్రొటోకాల్‌ను పాటించాలని స్పష్టం చేసింది. హోం టెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ స్టోర్లలో అందుబాటులో ఉందని, దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.  

మరిన్ని వార్తలు