మెరుగైన స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నాం

9 Mar, 2023 04:40 IST|Sakshi
బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో హోలీ వేడుకలో అల్బనీస్‌

ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ భారత పర్యటనపై మోదీ

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: భారత్‌– ఆస్ట్రేలియా బలీయ స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌నుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్న అల్బనీస్‌ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి నివాళులర్పించారు.

‘వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్న భారత్‌తో బహుముఖ బంధాలను బలపరుచుకునేందుకు ఆస్ట్రేలియాకు లభించిన అద్భుత అవకాశం ఇది. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు చోదక శక్తి భారత్‌. మా దేశంలో పెద్దసంఖ్యలో వైవిధ్య భారత్, ఆస్ట్రేలియా ప్రజల వల్లే మా దేశం ఇంతగా అభివృద్ధి చెందింది ’ అని భారత్‌కు విచ్చేసిన సందర్భంగా అల్బనీస్‌ వ్యాఖ్యానించారు.  

భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు
‘ఆస్ట్రేలియా–భారత్‌ విద్యార్హత గుర్తింపు వ్యవస్థ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు అల్బనీస్‌ ప్రకటించారు. అంటే ఆస్ట్రేలియా చదువుకుంటున్న, చదివిన భారతీయ విద్యార్థుల డిగ్రీలను ఇండియాలో అనుమతిస్తారు. అలాగే భారత్‌లో చదివిన డిగ్రీనీ ఆస్ట్రేలియాలో గుర్తింపునకు అనుమతిస్తారు. మరోవైపు గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకెన్‌ యూనివర్సిటీ తన అంతర్జాతీయ బ్రాంచ్‌ క్యాంపస్‌ను నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా నాలుగేళ్లపాటు చదవనున్న భారతీయ వి ద్యార్థులకు ‘మైత్రి’ పేరిట ఉపకారవేతనం సైతం అందిస్తామని అల్బనీస్‌ చెప్పారు.

నేడు మోదీతో కలిసి టెస్ట్‌ మ్యాచ్‌ వీక్షణ
బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని మోతెరా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆటను ప్రధాని మోదీతో కలిసి వీక్షిస్తారు. అల్బనీస్‌తో కలిసి మ్యాచ్‌ చూసేందుకు మోదీ సైతం బుధవారమే అహ్మదాబాద్‌ చేరుకున్నారు. తర్వాత అల్బనీస్‌ ముంబై చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత మోదీతోపాటు ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం తదితరాలపై చర్చించనున్నారు. ప్రధానిగా అల్బనీస్‌కు ఇదే తొలి భారత పర్యటన.
 

మరిన్ని వార్తలు