43 చైనా యాప్‌లపై నిషేధం

25 Nov, 2020 04:54 IST|Sakshi

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా తో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్‌ యాప్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌ సహా కొన్ని డేటింగ్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా ఉన్నందున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధం విధించింది.

ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర హోంశాఖ, ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌కు అందిన సమాచారాన్ని క్రోడీకరించి దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న  43 యాప్‌లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఇప్పటివరకు మూడు దఫాలుగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. గల్వాన్‌ లోయలో భారత్‌తో ఘర్షణలకు దిగిన డ్రాగన్‌ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్‌ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించింది.

భారత పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం భారత్‌లో విస్తృతం ప్రాచుర్యం కలిగిన  పబ్జి, టిక్‌టాక్‌ వంటి గేమింగ్‌ యాప్‌ల ఆటకట్టించింది. ఆ తర్వాత జూలై 27న ప్రజాదరణ పొందిన కామ్‌స్కానర్‌ వంటి మరో 47 యాప్‌లపై నిషేధం విధించింది. సెప్టెంబర్‌ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. పబ్జి, టిక్‌టాక్‌ వంటి గేమింగ్‌ యాప్‌లను తొలి దశలో నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు కామర్స్, డేటింగ్‌ యాప్‌లపై కొరడా ఝళిపించింది. తాజాగా 43 యాప్‌లతో మొత్తం నిషేధం విధించిన యాప్‌ల సంఖ్య 267కి చేరుకుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం వాటిల్లితే ఎలాంటి చర్యలకైనా దిగుతామని కేంద్రం స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా