అభివృద్ధి పథంలో ఆర్మీ భూములు!

20 Jul, 2021 05:36 IST|Sakshi

మెట్రో, ఫ్లై ఓవర్లు, రైల్వే వంటి వాటికోసం తీసుకునే అవకాశం

నియమాలను సవరిస్తున్న మోదీ సర్కార్‌

న్యూఢిల్లీ: రక్షణ శాఖ భూముల విధానంలో (డిఫెన్స్‌ ల్యాండ్‌ పాలసీ) కీలక సంస్కరణలకు కేంద్ర  ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రక్షణ శాఖకు చెందిన భూములను ఇతర అవసరాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. ప్రజా ప్రాజెక్టులు, సైనికేతర అవసరాల నిమిత్తం ఇకపై రక్షణ శాఖ భూములను సేకరించవచ్చు. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అయితే, సేకరించిన భూమికి ప్రతిఫలంగా సైనిక దళాలకు అంతే విలువ కలిగిన భూమిని మరోచోట ఇవ్వాలి.

ఈక్వల్‌ వాల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌–ఈవీఐ లేదా మార్కెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటిషర్లు భారత్‌లో తొలిసారిగా 1765లో పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌లో సైనిక కంటోన్మెంట్‌ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్‌ భూములను సైనికేతర అవసరాలకు ఉపయోగించకుండా అప్పటి నుంచి నిషేధం కొనసాగుతోంది. కంటోన్మెంట్లలోని బంగ్లాలు, క్వార్టర్లను సైన్యంతో సంబంధం లేని వారికి విక్రయించడం లేదా వారు ఆక్రమించడం చెల్లదంటూ 1801లో అప్పటి ఈస్టిండియా కంపెనీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు 200 ఏళ్ల తర్వాత దేశంలో రక్షణ భూముల విధానంలో సంస్కరణలు తేవడం ఇదే మొదటిసారి. కంటోన్మెంట్‌ జోన్లలో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కంటోన్మెంట్‌ బిల్లు–2020ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఇందులో కొన్ని మార్పులు చేసింది.

మెట్రో రైళ్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు, రైల్వే వంటి పబ్లిక్‌ ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ నుంచి భూములను సేకరించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే, సేకరించిన భూమికి గాను సమాన విలువ కలిగిన భూమిని ఇవ్వడం గానీ లేదా మార్కెట్‌ ధర చెల్లించడం గానీ చేయాలని పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి పూర్తయిన తర్వాతే భూమిని బదలాయించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్లలోని భూమి విలువను స్థానిక సైనిక ఆథారిటీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారిస్తుంది. కంటోన్మెంట్ల వెలుపల గల భూమి విలువను జిల్లా మేజిస్ట్రేట్‌ (కలెక్టర్‌) ఖరారు చేస్తారు. దేశంలో ప్రధాన నగరాల్లో కీలకమైన ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములున్నాయి. పబ్లిక్‌ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయా భూములు కావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

మరిన్ని వార్తలు