చైనా సైన్యం పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందే

1 Aug, 2021 03:47 IST|Sakshi

డ్రాగన్‌తో 12వ దఫా చర్చల్లో భారత్‌ పునరుద్ఘాటన

ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 9 గంటలపాటు సంప్రదింపులు

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాతోపాటు ఇతర కీలక ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని భారత్‌ పునరుద్ఘాటించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డ్రాగన్‌ దేశానికి స్పష్టం చేసింది. సరిహద్దుల్లో మోహరించిన ఆయుధ సంపత్తిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య 12వ దఫా సైనిక చర్చలు శనివారం తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) సమీపంలో చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారులు దాదాపు 9 గంటలపాటు చర్చించుకున్నట్లు తెలిసింది.

ఈసారి చర్చలు సమగ్రంగా జరిగాయని, పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధికారులు అభిప్రాయాలను పంచుకున్నారని భారత సైనిక వర్గాలు వెల్ల డించాయి. అయితే, ఈ భేటీలో చివరకు ఏం తేల్చారన్న దానిపై సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్, చైనా మధ్య ఘర్షణకు కారణమవుతున్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.  హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాలో చైనా కార్యకలాపాల పట్ల భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత్, చైనా నడుమ 11వ దఫా చర్చలు ఏప్రిల్‌ 9వ తేదీన 13 గంటలపాటు జరిగిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన 12వ దఫా చర్చల్లో భారత్‌ తరపున లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వద్ద భారత్, చైనా ప్రస్తుతం దాదాపు 60,000 చొప్పున సైనికులను మోహరించాయి.

మరిన్ని వార్తలు