సయోధ్య దిశగా...

1 Oct, 2020 06:21 IST|Sakshi
మనాలి–లే రహదారి మీదుగా లద్దాఖ్‌ వైపు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులు

భారత్, చైనా మరో దఫా చర్చలు

ఆ అయిదు అంశాల అమలుకు ఇరుపక్షాలు అంగీకారం

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు భారత్, చైనా మధ్య బుధవారం జరిగిన మరో దఫా చర్చల్లో ముందడుగు పడింది. ఇరు పక్షాలు అపార్థాలను, అనుమానాలను పక్కన పెట్టి సుస్థిరత నెలకొల్పే దిశగా సామరస్యంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించాయి. అయిదు నెలలుగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని నివారించడానికి సెప్టెంబర్‌ 10న మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య కుదిరిన అయిదు అంశాల ఒప్పందం అమలుకు సంబంధించి చర్చలు జరిపారు.

సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ (డబ్ల్యూఎంసీసీ) మార్గదర్శకాలకు అమలుకి చేపట్టాల్సిన చర్యలపై ఇరు దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు ఆన్‌లైన్‌ ద్వారా చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని వెంటనే ఉపసంహరించడం, సరిహద్దు నిర్వహణలో అన్ని ప్రోటోకాల్స్‌ని పాటించడం, శాంతి స్థాపన వంటి అంశాలపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్ని కూడా సమీక్షించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
 

మరిన్ని వార్తలు