భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో గట్టి కౌంటర్‌ పడేనా?

13 Dec, 2022 08:50 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ.. దేశ చట్ట సభను కుదిపేయనుందా?. అవుననే సంకేతాలు అందిస్తున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2022లో భాగంగా.. ఇవాళ(మంగళవారం) చైనా-భారత్‌ సరిహద్దు ఘర్షణ అంశాన్ని లేవనెత్తి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ భావిస్తోంది. 

డిసెంబర్‌ 9వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌ వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత్‌-చైనా బలగాలు గొడవ పడ్డాయని, ఈ ఘనటలో ఇరు వర్గాలకు స్వల్ఫ గాయాలు అయ్యాయనేది సమాచారం. ఈ సమాచారం తెలియగానే.. కాంగ్రెస్‌ కేంద్రాన్ని ఏకిపారేయడం ప్రారంభించింది. పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్లు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించడం ద్వారా ప్రభుత్వ తీరును దేశం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలు ఇరు సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం వాయిదా తీర్మానం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని.. ఎందుకు బహిర్గత పర్చలేదని ఆయన అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే..

ఈ విషయంలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. కేంద్రం ఎప్పుడూ ఎలాంటి చర్చలకు వెనుకాడలేదని, వాస్తవాలతో సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా  పార్లమెంట్‌లో ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. 

2020లో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద 20 మంది భారతీయ సైనికులు మరణించిన భీకర ఘర్షణ తర్వాత.. భారత్‌-చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనిక అధికారులు, సైనికులు మరణించారని చైనా ప్రకటించినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న కథనాలు వినిపించాయి. 

ఇదీ చదవండి: మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు!

మరిన్ని వార్తలు