తూర్పు లద్దాఖ్‌ నుంచి వెనక్కి మళ్లుదాం

21 Feb, 2021 05:25 IST|Sakshi

భారత్, చైనా మధ్య పదో దఫా చర్చలు

న్యూఢిల్లీ: పాంగాంగ్‌ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి కావడంతో తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్‌పై భారత్, చైనా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాలు సంప్రదింపులు ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య పదో దఫా కమాండర్‌ స్థాయి చర్చలు శనివారం ఎల్‌ఏసీ వద్ద మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో జరిగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైనిక అధికారులు హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్‌ నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. సైనిక బలగాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ చాలా వేగంగా జరగాలని భారత్‌ నొక్కి చెప్పింది. చైనా కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు