తూర్పు లద్దాక్‌లో బలగాలను ఉపసంహరించుకున్న భారత్‌, చైనా

13 Sep, 2022 16:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్‌ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్‌ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు.
చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు